మహిళకూ ఆరోగ్య బీమా అవసరమే..
మహిళలూ ప్రస్తుతం బహుముఖ పాత్ర పోషిస్తున్నారు. హోమ్మేకర్గా తన ఇళ్లు, కుటుంబ భద్రతకు ఆమె ప్రాధాన్యత ఇస్తారు. ఉద్యోగంలో వృత్తిపరమైన బరువు బాధ్యతలను మోస్తున్నారు. ఇలా ప్రతి విషయం, విభాగంలో ఒక స్వతంత్ర నిర్ణేతగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఆమె సైతం తన ఆరోగ్యం జాగ్రత్తగా ఉంచుకోవడానికి, ఆయా సందర్భాల్లో సమస్యలను అధిగమించడానికి అత్యంత ప్రాధాన్యతను ఇవ్వాల్సిన అవసరం ఉంది.
వైద్య వ్యయాల భారం...
తరచూ చేయించుకునే ఆరోగ్య పరీక్షలు... క్రమం తప్పని వ్యాయామ ప్రణాళికలు... ఆరోగ్యవంతమైన ఆహారం ఇవన్నీ సరే. ఒక్కొక్కసారి ఆరోగ్యసమస్యలు అనుకోకుండా వచ్చిపడతాయి. అందుకు పలు కారణాలు ఉండవచ్చు. ఇలాంటి సమస్యను కూడా ఎదుర్కొనగలిగే స్థాయిలో ప్రణాళికలు రూపొం దించుకోవాల్సిన అవసరం ఉంది. కేన్సర్, బ్యాక్టీరియా పరమైన తీవ్ర ఇన్ఫెక్షన్లు, బ్రెయిన్ ఫీవర్ వంటి సమస్యలు ఆరోగ్యాన్ని ప్రమాదాల్లో పడేస్తాయి. ముఖ్యంగా బ్రెస్ట్ కేన్సర్ మహిళలకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా కలవర పెడుతున్న అంశమని టాటా మెమోరియల్ సెంటర్ ఇటీవలి ఒక అధ్యయనంలో తేల్చింది. మరో సమస్యాత్మకమైనది సర్వికల్ కేన్సర్. దీనివల్ల వార్షికంగా దాదాపు 74,000 మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు అంచనా. ఆయా వ్యాధుల బారిన పడితే వైద్య వ్యయాలు భరించలేని భారంగా మారుతున్నాయి. నేటి మహిళ ఇంటి పనులకే పరిమితం కావడంలేదు. ఒకవేళ ఇంట్లోనే ఉంటున్నా... కుట్లో... అల్లికలో... ఇలా ఏదో ఒక కష్టంచేసి... ఎంతోకొంత సంపాదిస్తున్నారు. ఒక్కొక్క సందర్భాల్లో వీరి రెక్కల కష్టమే సంసారం గడవడానికి సాధనమవుతోంది. ఇలాంటి మహిళల విషయంలో ఆమె ఆరోగ్యానికి ఏదైనా ప్రమాదం ఏర్పడితే... మొత్తం కుటుంబంపై ఈ ప్రతికూల పరిస్థితి పడుతుంది.
‘క్రిటికల్ ఇల్నెస్’ బీమా... ధీమా
ఈ నేపథ్యంలో మహిళలకూ ఆరోగ్య బీమా అవసరం ఎంతో ఉందని పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. అయితే మామూలు ఆరోగ్య బీమా పాలసీలు వైద్య అవసరాలను పెద్దగా తీర్చలేకపోవచ్చు. ముఖ్యంగా ‘తీవ్ర వ్యాధుల’ (క్రిటికల్ ఇల్నెస్) సమస్యలు ఎదురయినప్పుడు ఆయా ఇబ్బందులను అధిగమించడానికి ‘క్రిటికల్ ఇల్నెస్’ రైడర్లతో సమగ్ర పాలసీలను ఎంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. క్రిటికల్ ఇల్నెస్ హెల్త్ ఇన్సూరెన్స్ వల్ల ప్రయోజనాలు అపారం. ఆరోగ్యపరమైన అంశాలకు సంబంధించి ‘తీసుకున్న బీమా మొత్తం అంతా చెల్లించేలా’(లమ్సమ్) బీమా కంపెనీలు ప్రొడక్టులు ఆఫర్ చేస్తున్నాయి. అయితే ఇవి ఒక్కొక్క సందర్భంలో ఆసుపత్రి వ్యయాలకే సరిపోని పరిస్థితి ఉంటుంది. అందువల్ల ‘క్రిటికల్ ఇల్నెస్’ రైడర్‌తో కూడిన ఆరోగ్య బీమా పాలసీల ఎంపిక అవసరం.
అవసరాలకు తగిన పాలసీలు...
పలు బీమా కంపెనీలు ప్రస్తుతం మహిళల ఆరోగ్యానికి, వ్యాధులకు సంబంధించిన ప్రత్యేక బీమా ప్రొడక్టులను అందిస్తున్నాయి. బ్రెస్ట్ కేన్సర్, ఫ్యాలోపియన్ ట్యూబ్ కేన్సర్, యూటెరిన్ కేన్సర్, ఓవేరియన్ కేన్సర్, వెజైనల్ కేన్సర్, సర్వికల్ కేన్సర్ వంటి వ్యాధులను కవర్ చేసే బీమా ప్రొడక్టులు ఇందులో ఉన్నాయి. ఆసుపత్రిలో, అటుపై డిశ్చార్జ్ అనంతరం వ్యయాలను సైతం కవర్చేసే ప్రొడక్టులు ఉన్నాయి. వ్యక్తిగత ప్రమాద బీమా, పిల్లల ఎడ్యుకేషన్ ఫండ్... వంటివి కూడా ప్రత్యేకంగా మహిళలకు ఉద్దేశించినవి ఉన్నాయి. లమ్సమ్ (ఏకమొత్తం) నుంచి రికవరీ సమయంలో ప్రయోజనం చేకూర్చేలా... అంటే ఈఎంఐ, స్కూల్ ఫీజులు, క్రెడిట్ కార్డ్ చెల్లింపులు, రోజూవారీ జీవన వ్యయాల వరకూ కవర్చేసే ప్రొడక్టులు అందుబాటులో ఉన్నాయి. వీటన్నింటికీ తోడు... హెల్త్ ఇన్సూరెన్స్‌కు సంబంధించి చెల్లించే ప్రీమియంలు ఆదాయపు పన్ను శాఖ 80డీ సెక్షన్ కిందకు కూడా వచ్చే విషయం ఇక్కడ ప్రస్తావనాంశం. అవసరాలకు అనుగుణంగా ఈ ప్రొడక్టులను వినియోగించుకుంటే... మీ కుటుంబ ఆర్థిక ఆరోగ్యానికి ‘బీమా’ రక్ష.
డివిడెండ్ ధమాకా
రిటైల్ ఇన్వెస్టర్లను ఆకర్షించడానికి మ్యూచువల్ ఫండ్ సంస్థలు భారీ డివిడెండ్లను ప్రకటిస్తున్నాయి. టాటా మ్యూచువల్ ఫండ్ ప్యూరీ ఈక్విటీ పథకంపై 40 శాతం, యూటీఐ ట్యాక్స్ సేవింగ్ ఫండ్‌పై 22 శాతం డివిడెండ్‌ను ప్రకటించింది. ఈ డివిడెండ్స్‌కు రికార్డు తేదీ జనవరి 19గా నిర్ణయించారు. ఈ తేదీ నాటికి యూనిట్లు కలిగి వున్న వారికి ప్రతీ యూనిట్‌పై టాటా ఈక్విటీ ఫండ్ రూ. 4.4, యూటీఐ ట్యాక్స్ సేవింగ్ ఫండ్ రూ. 2.2 డివిడెండ్ లభిస్తుంది.
ఐసీఐసీఐ ఎంఎఫ్‌కి గుర్తింపు
2014 సంవత్సరానికి గాను అత్యుత్తమ ఫండ్ హౌస్‌గా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ సంస్థ ఎంపికయ్యింది. ఆసియాలో గత 12 ఏళ్లుగా మంచి పనితీరును కనపరుస్తున్నందుకు గాను ఆసియా అసెట్ మేనేజ్మెంట్ జర్నల్ ఈ అవార్డుకు ఎంపిక చేసింది.
కొటక్ బ్యాంక్ సోషల్ సేవింగ్
సోషల్ నెట్వర్క్ సైట్స్ ఫేస్బుక్, ట్వీటర్ ద్వారా బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిన కొటక్ మహీంద్రా బ్యాంక్ ‘జిఫి సేవర్’ పేరుతో సోషల్ సేవింగ్ అకౌంట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. లక్ష కన్నా ఎక్కువ డిపాజిట్ చేసిన మొత్తంపై 6%, అంతకంటే తక్కువ మొత్తంపై 5% వడ్డీని జిఫి సేవర్ అందిస్తోంది. డిజిటల్ బ్యాంకింగ్ ఖాతాదారుల్లో 20-25% మంది ట్విట్టర్, ఫేస్‌బుక్‌ను వినియోగిస్తున్నారు.