వీడియో కాన్ఫరెన్స్‌లో విచారణలు
సాక్షి, చెన్నై: కుటుంబ సంక్షేమ కోర్టుల్లో విడాకుల కేసుల విచారణలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించుకోవచ్చని మద్రాసు హైకో ర్టు అనుమతి ఇచ్చింది. ఇందుకు తగ్గ ఆదేశాలను గురువారం వెలువరించింది. మద్రాసు హైకోర్టు ఆవరణలో కుటుంబ సంక్షేమ కోర్టు ఉంది. ఇక్కడ విడాకుల కోసం కొందరు, పర సర్పర అంగీకారంతో మరి కొందరు విడాకుల కోసం పిటిషన్లను దాఖలు చేస్తున్నారు. ఈ కేసులు కోకొల్లలుగా పేరుకు పోతున్నారుు. కొన్ని కేసుల్లో విచారణలు జాప్యం అవుతున్నాయి. భర్త దాఖలు చేసిన పిటిషన్‌కు భార్య, భార్య దాఖలు చేసిన పిటిషన్‌కు భర్త విచారణకు గైర్హాజరు కావడం పెరుగుతోంది.
ఇందుకు కుంటిసాకుగా తాము బయటి ఊళ్లల్లోను, రాష్ట్రాల్లోను , దేశాల్లోను ఉన్నామని, తరచూ విచారణకు రాలేని పరిస్థితి అని వివరణ ఇచ్చుకుంటూ వస్తున్నారు. ఈరకంగా విచారణలు వాయిదాల మీద వాయిదాలతో సాగుతూ వస్తున్నాయి. దీన్ని పరిగణనలోకి తీసుకున్న సీనియర్ న్యాయవాది సుధారామలింగం మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మొదటి, అనుబంధ కుటుంబ సంక్షేమ కోర్టుల్లో ఉన్న విడాకుల పిటిషన్ల వివరాల్ని తన పిటిషన్ ద్వారా హైకోర్టు దృష్టికి తెచ్చారు. భర్త లేదా భార్య, మరో రాష్ట్రంలోను, విదేశాల్లోను ఉంటే, విచారణలు జాప్యం అవుతున్నాయని వివరించారు.
అందుకే విచారణలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని కుటుంబ సంక్షేమ కోర్టును ఆశ్రయించగా, నిరాకరించినట్టు హైకోర్టు దృష్టికి తెచ్చారు. భర్త, భార్య విదేశాల్లో గానీ, ఇతర రాష్ట్రాల్లో గానీ ఉంటే విచారణల్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించి కేసుల్ని త్వరితగతిన పరిష్కరించాలని 2007లో హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని గుర్తు చేశారు. అయితే, కుటుంబ న్యాయస్థానం అంగీకరించని దృష్ట్యా, అందుకు తగ్గ ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
త్వరితగతిన ముగించాలి
ఈ పిటిషన్‌ను ఉదయం ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్, న్యాయమూర్తి చంద్రనాయగంల నేతృత్వంలోని బెంచ్ విచారించింది. వాదనల అనంతరం కేసుకు సంబంధించి భర్త లేదా భార్య విదేశాల్లో ఉన్నా, పక్క రాష్ట్రాల్లో ఉన్నా, విచారణకు రాలేని పరిస్థితి ఉన్నా, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తమ వాదనలు వినిపించ వచ్చని బెంచ్ సూచించింది. ఇలాంటి కేసులను మొదటి కుటుంబ సంక్షేమ కోర్టు లేదా అనుబంధ కోర్టు వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా విచారణను చేపట్టి త్వరితగతిన ముగించాలని ఆదేశించింది.