‘పాగ పుల్లారెడ్డి రాజనీతిజ్ఞుడు’
గద్వాలటౌన్: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, మేధావి, మాజీ శాసనసభ్యుడు పాగపుల్లారెడ్డి వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సోమవారం స్వాతంత్య్ర సమరయోధులు, రిటైర్డ్ ఉద్యోగుల ఆధ్వర్యంలో స్థానిక బాలభవన్‌లో చిన్నారి కళాకారుల నడుమ బాలభవన్ సిబ్బంది వేడుకలను నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు ఆయన సేవలను కొనియాడారు. పాగ పుల్లారెడ్డి గొప్ప ప్రజాసేవకుడు, ఆదర్శ రాజ నీతిజ్ఞుడు అని ఎమ్మెల్యే డీకే అరుణ పేర్కొన్నారు.
వర్ధంతి కార్యక్రమంలో ఆమె పాగ పుల్లారెడ్డి చిత్రపటానికి ఆమె పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గద్వాల బాలభవన్‌కు రాష్ట్రస్థాయిలో గుర్తింపు తెచ్చిన గొప్పవ్యక్తి అని కొనియాడారు. గద్వాల వైభవాన్ని ప్రపంచానికి చాటిన మహామనిషి అని అన్నారు. కార్యక్రమంలో బాలభవన్ కమిటీ సభ్యులు రాజగోపాలాచారి, సూపరింటెండెంట్ విజయలక్ష్మి, రామిరెడ్డి మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్ గడ్డం కృష్ణారెడ్డి, మురళీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అనంతరం విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే డీకే భరతసింహారెడ్డి పాగ పుల్లారెడ్డి చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూరాల ప్రాజెక్టు ఏర్పాటుతో పాటు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టుల సాధనకు, రైల్వేలైన్ల కోసం కోసం కృషిచేసిన మహనీయుడని కొనియాడారు. ఉన్నత విలువలతో కూడిన ఆయన జీవితం అందరికీ ఆదర్శమన్నారు. కార్యక్రమంలో శంకరయ్య, బాలకిషన్, గార్లపాడు కృష్ణయ్య, లక్ష్మిరెడ్డి, సవారన్న, వెంకట్రాములు తదితరులు పాల్గొన్నారు.