ప్రియురాలి చావుకొచ్చిన అభిమానం..!
సాక్షి, న్యూ ఢిల్లీ: అభిమానం వెర్రిగంగలెత్తితే ఇలాగే ఉంటుందేమో.. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ కనికరించనందుకు అతని ప్రేయసిని చంపుతానంటూ ఓ మహిళాభిమాని బెదిరింపులకు దిగింది. వరుణ్ ధావన్‌ని కలిసేందుకు అతని ఇంటిముందు చాలాసేపు ఓ అభిమాని వేచి చూసింది. ‘కళంక్’ సినిమా ప్రమోషన్లో బిజీగా ఉన్న వరుణ్ ఇంటికి కాస్త ఆలస్యంగా రావడమే కాక.. అలిసిపోయి ఉన్నానని, కలవటం కుదరదని చెప్పాడు. ఇదేమీ పట్టించుకోని సదరు అభిమాని వరుణ్ని కలవాల్సిందేనని పట్టుబట్టింది. కుదరదని చెప్పటంతో వరుణ్ ప్రేయసి నటాషా దలాల్‌ను చంపుతానని వీరంగం సృష్టించింది. వరుణ్ ఇంటి వద్ద ఆమెను పంపించడానికి హీరో సిబ్బంది విశ్వ ప్రయత్నం చేసినా దాదాపు 45 నిమిషాలపాటు ఆమె రచ్చ చేయడంతో పోలీసులను పిలిపించక తప్పలేదు!