‘పరిషత్’లో ఫ్యాను స్పీడు
రెండో విడతలోనూ మెజారిటీ జెడ్పీటీసీ స్థానాల్లో వైఎస్సార్ సీపీ గెలుపు అవకాశాలు
గెలుపుకోసం ప్రలోభాలను రెట్టింపు చేసిన టీడీపీ
సాక్షి, తిరుపతి: పరిషత్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు విజయావకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ నెల ఆరో తేదీన మదనపల్లె డివిజన్ పరిధిలో తొలివిడతలో జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో ఆ పార్టీ జోరు ప్రదర్శించింది.
ఈ నేపథ్యంలో శుక్రవారం జరగనున్న రెండోవిడత ఎన్నికల్లోనూ ఆ పార్టీ అదే జోరు ప్రదర్శించనున్నట్టు రాజకీయ పరిశీలకు లు అంచనా వేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ప్రాతినిథ్యం వహిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ హవా కనిపిస్తోంది. అంతేకాకుండా కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన గల్లా అరుణకుమారి, గుమ్మడి కుతూహలమ్మ ప్రాతినిథ్యం వహిస్తున్న చంద్రగిరి, గంగాధరనెల్లూరు నియోజకవర్గాల్లోనూ వైఎస్సార్ సీపీ అభ్యర్థులకు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
గంగాధరనెల్లూరు నియోజకవర్గంలోని పాలసముద్రం, కార్వేటినగరంలో టీడీపీ అభ్యర్థులు గట్టి పోటీ ఇస్తున్నా, వైఎస్సార్ సీపీ అభ్యర్థులకే గెలుపు అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
చంద్రగిరి నియోజకవర్గంలో ఒక్క చంద్రగిరిలో టీడీపీ, వైఎస్సార్ సీపీ మధ్య నువ్వానేనా అన్నట్టు పోటీ నెలకొంది. మిగిలిన మండలాల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులకు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
నగరి నియోజకవర్గంలో వడమాలపేట మండలంలో మాత్రం పోటాపోటీగా ఉంది. మిగిలిన మండలాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ సులువుగా గెలుస్తుందనే అభిప్రాయం ఉంది.
హస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలంలో కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కు కావడంతో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థికి గట్టి పోటీ ఇవ్వగలుగుతున్నారు. మిగిలిన మండలాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థుల విజయం నల్లేరు మీద నడకగా మారింది.
సత్యవేడు నియోజకవర్గంలో చంద్రబాబు సామాజికవర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్న ఒకటిరెండు మండలాలు మినహాయిస్తే మిగిలిన మండలాల్లో వైఎస్సార్ సీపీకి అనుకూలపవనాలు వీస్తున్నాయి.
పూతలపట్టు నియోజకవర్గంలోనూ టీడీపీ సంప్రదాయ ఓటర్లు ఉన్న మండలాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులకు ఓ మోస్తరు పోటీ ఉంది. మెజారిటీ జెడ్పీటీసీలను వైఎస్సార్ కాంగ్రెస్ కైవసం చేసుకునే పరిస్థితులు ఉన్నాయి.
సత్యవేడు నియోజకవర్గంలో ఒకటి రెండు చోట్ల మాత్రమే తెలుగుదేశం అభ్యర్థులు గట్టి పోటీ ఇస్తున్నారు.
తొలివిడత జరిగిన పరిషత్ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం లో నాలుగు జెడ్పీటీసీ స్థానాల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇచ్చింది. ఇందులో రెండు చోట్ల గెలిచే అవకాశం ఉంది. పలమనేరు, పుంగనూరు, మదనపల్లె, పీలేరు, తంబళ్లపల్లె నియోజకవర్గాల పరిధిలో సైతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మెజారిటీ స్థానాలు గెలుచుకోనున్నారు.
రెట్టింపు మొత్తంలో ‘దేశం’ ప్రలోభాలు
తొలివిడత ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు పెద్ద ఎత్తున డబ్బు, మద్యం పంపిణీ చేసిన తెలుగుదేశం పార్టీ రెండో విడతలోనూ కొనసాగించింది. తొలివిడత ఎన్నికల ఓటింగ్ సరళి ప్రతికూలంగా ఉన్నట్టు అంచనాకు రావడంతో రెండో విడతలో రెట్టింపు మొత్తంలో డబ్బు పంపిణీ చేసింది. ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని రకాల ఎత్తులు వేసింది. చంద్రగిరి నియోజకవర్గంలో గురువారం ఒక్కరోజు రెండు చోట్ల మద్యం పంపిణీ చేస్తుండగా పోలీసులు టీడీపీ కార్యకర్తలను అరెస్టు చేశారు.
అదేవిధంగా పుత్తూరు రూరల్ మండలంలోనూ ఐదుగురు టీడీపీ కార్యకర్తలు మద్యం పంపిణీ చేస్తూ పట్టుబడ్డారు. పూతలపట్టు నియోజకవర్గంలో యువకులకు ఆహ్లాదకరమైన ప్రాంతాల్లో భారీ విందులు ఏర్పాటు చేశారు. పూతలపట్టు, ఐరాల మండలాల్లో ఓటర్లకు ఒక్కొక్కరికి *500 నుంచి *2000 వరకు డబ్బు పంపిణీ చేశారు. గంగాధరనెల్లూరు నియోజకవర్గం పెనుమూరు మండలంలోని కామచిన్నయ్యపల్లె, రామకృష్ణాపురం ఎంపీటీసీ సెగ్మెంట్లలో మహిళలకు ముక్కుపుడకలు పంపిణీ చేశారు. చంద్రగిరి -2 ఎంపీటీసీ సెగ్మెంట్లో వెండి దీపపు స్తంభాలు ఇంటింటికి చేరవేశారు.