పురపోరులో ‘ఫ్యాన్’ స్పీడు | Puraporulo 'Fan' speed | Sakshi
Sakshi News home page

పురపోరులో ‘ఫ్యాన్’ స్పీడు

Published Sun, Mar 30 2014 1:36 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

పురపోరులో ‘ఫ్యాన్’ స్పీడు - Sakshi

పురపోరులో ‘ఫ్యాన్’ స్పీడు

  • షర్మిల యాత్రతో పట్టణాల్లో పట్టు
  •  విజయవాడకే పరిమితమైన బాబు గర్జన
  •  జిల్లాలో ప్రచారంలో తెలుగుదేశం వెనుకబాటు
  •  టీడీపీ, కాంగ్రెస్ కుమ్మక్కు కుట్రలు
  •  సాక్షి ప్రతినిధి, విజయవాడ : పురపాలకులను ఎన్నుకునే సమయం ఆసన్నమైంది. జిల్లాలోని విజయవాడ నగరంతో పాటు ఎనిమిది మున్సిపాలిటీల్లో ఆదివారం పోలింగ్ జరగనుంది. జయాపజయాలపై అప్పుడే సర్వేలు, బెట్టింగులు ఊపందుకున్నాయి. రాజకీయ పార్టీల సమీకరణల మాట ఎలా ఉన్నా నేతల పర్యటనలు సైతం ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల జిల్లాలో మూడురోజులపాటు మెరుపు వేగంతో ప్రచారం నిర్వహించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మాత్రం విజయవాడలో మహిళాగర్జనకు పరిమితమయ్యారు. ఇంకా కాంగ్రెస్, మిగిలిన పార్టీలు కనీసం పురప్రజలను పట్టించుకున్న దాఖలాలు లేవు.
     
    ‘ఫ్యాన్’ గాలి...

    తన ప్రచార యాత్రతో కేడర్‌లో మరింత ఉత్సాహం కలిగించిన షర్మిల పలు మున్సిపాలిటీల్లో ఓటర్లను ఆకట్టుకుని ఫ్యాన్ గాలి స్పీడు పెంచారు. జిల్లాలోని ఉయ్యూరు, పెడన, నూజివీడు, తిరువూరు, నందిగామ, జగ్గయ్యపేట మున్సిపాలిటీల్లో షర్మిల ప్రచారానికి విశేష స్పందన లభించింది. చంద్రబాబు మహిళా గర్జన సాకుతో షర్మిల యాత్రకు బందోబస్తు ఇవ్వలేమని విజయవాడ పోలీసులు చేతులెత్తేశారు. దీంతో విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల తరఫున షర్మిల ప్రచారానికి అవాంతరం వచ్చింది.

    అయినా మున్సిపల్ ప్రచారంతోనే షర్మిల ఆగిపోకుండా ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసేలా పామర్రు, గన్నవరం, మైలవరం నియోజకవర్గాలతో పాటు విజయవాడ రూరల్ ప్రాంతంలోను నిర్వహించిన యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. దీంతో జిల్లాలో జరగనున్న వరుస ఎన్నికలపై ఆమె ప్రచార ప్రభావం వైఎస్సార్‌సీపీకి మరింత బలం పెంచింది. మున్సిపల్ ఎన్నికల్లో షర్మిల యాత్ర కారణంగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, పార్టీ శ్రేణుల్లో జోష్ పెరిగింది.
     
    చంద్రబాబు చిర్రుబుర్రులు..
     
    మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పూర్తిగా వెనుకబడ్డ చంద్రబాబు మహిళా గర్జన కోసం జిల్లాకు వచ్చి పార్టీ నేతలపై చిర్రుబుర్రులాడారు. మహిళా గర్జనకు జన సమీకరణ బాగాలేదని జిల్లా నేతలను తిట్టిపోసిన చంద్రబాబు మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని పట్టించుకోకపోవడంతో తెలుగు తమ్ముళ్లు పెదవి విరుస్తున్నారు. ఇప్పటికే షర్మిల యాత్రతో కలవరపడుతున్న తెలుగు తమ్ముళ్లను బాబు పట్టించుకోకపోవడంతో వారు కినుక వహించారు. సొంత పార్టీలో ఏళ్ల తరబడి సేవలందించినవారిని వదిలి కొత్తవారి కోసం అర్రులు చాస్తున్న చంద్రబాబు తీరుతో ఆ పార్టీలోనే సీనియర్లు గుర్రుగా ఉన్నారు. ఇవేమీ పట్టించుకోని చంద్రబాబు మున్సిపల్ ఎన్నికలను అస్సలు పట్టించుకోకుండా ఎప్పుడో జరిగే సార్వత్రిక ఎన్నికలపై హడావుడి చేయడంతో చాలా పట్టణాల్లో సైకిల్ పరుగుపెట్టలేకపోతోందని తెలుగు తమ్ముళ్లు ఆవేదన చెందుతున్నారు.
     
    మున్సిపాలిటీల్లోను కుమ్మక్కు కుట్ర..

    జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ టీడీపీతో కుమ్మక్కు కుట్రలు సాగిస్తోంది. మున్సిపల్ ఎన్నికల సాక్షిగా మరోమారు నిస్సిగ్గుగా కలిసిమెలిసి ప్రచారం చేశారు. గతంలో సహకార ఎన్నికలు, పంచాయతీ ఎన్నికల్లోను కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కు రాజకీయాలు సాగించిన సంగతి తెల్సిందే. తాజాగా మున్సిపల్ ఎన్నికలు వచ్చేనాటికి జిల్లాలో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతయ్యే దుస్థితి దాపురించింది. దీంతో ఆ పార్టీ నేతలు మరోమారు టీడీపీతో కుమ్మక్కై పురపోరులో పాల్గొంటున్నారు. తమకు కొన్ని మున్సిపల్ వార్డులు ఇచ్చినా చాలు అని బేరసారాలు జరిపిన కాంగ్రెస్ చాలాచోట్ల బాహాటంగానే టీడీపీ అభ్యర్థుల గెలుపుకోసం ప్రచారం నిర్వహించడం కొసమెరుపు. ఏది ఏమైనా కుమ్మక్కు కుట్రలను నిశితంగా గమనిస్తున్న ఓటర్లు విజ్ఞతను ప్రదర్శించే సమయం వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement