జనాభిమానం | From the junction to spend janapravaham | Sakshi
Sakshi News home page

జనాభిమానం

Published Thu, Mar 27 2014 12:55 AM | Last Updated on Sat, Sep 2 2017 5:12 AM

From the junction to spend janapravaham

  • రెండోరోజూ ప్రభంజనమే..
  •  జంక్షన్ నుంచి నందిగామ వరకు జనప్రవాహం
  •  నూజివీడు, తిరువూరు, నందిగామ మున్సిపాలిటీల్లో షర్మిల ప్రచారం
  •  సాక్షి, నూజివీడు/ తిరువూరు/ నందిగామ : మండేఎండలోనూ షర్మిల సాగించిన ఎన్నికల ప్రచారానికి ప్రజాభిమానమే గొడుగైంది.. రెండోరోజు బుధవారం జిల్లాలో ఆమె నిర్వహించిన ప్రచారంలో ఫ్యాన్‌గాలి ప్రభంజనాన్ని సృష్టించింది.. భగభగమండే సూర్యుడిని తలపించేలా ఆమె చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డి, చిరంజీవిలపై నిప్పులవాన కురిపించారు. జనంకోసం పరితపించే రాజన్న వారసుడిగా జగనన్నకు ఒక అవకాశం ఇస్తే.. తన జీవితాన్నే మీకోసం అర్పిస్తాడంటూ షర్మిల చేసిన ప్రసంగం మండుటెండలో  సైతం చల్లని గాలిలా ప్రజల మదిని తాకినట్టయింది. ఉదయం నుంచి రాత్రి వరకు షర్మిల సాగించిన ఎన్నికల ప్రచారంలో ప్రజలు అభిమానంతో అడ్డుపడి ఆమె కాన్వాయ్‌ను ముందుకు సాగనీయలేదు. యాత్ర ఆలస్యంగానే సాగినా అన్ని ప్రాంతాల్లోనూ ప్రజలు ఆమె రాకకోసం నిరీక్షించారు.
     
    అడుగడుగునా బ్రహ్మరథం..
     
    హనుమాన్‌జంక్షన్ నుంచి నందిగామ వరకు షర్మిల సాగించిన యాత్రలో అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పూలు చల్లుతూ కార్యకర్తలు, మంగళహారతులతో ఆశీర్వదిస్తూ మహిళామూర్తులు, డప్పులదరువుకు అనుగుణంగా చిందేస్తూ యువత.. ఉత్సాహంగా షర్మిలకు ఎదురెళ్లి స్వాగతం పలికారు. షర్మిలయాత్ర సాగిన దారిలో దాదాపు అన్ని గ్రామాల్లోను మహిళలు, రైతులు, వృద్ధులు, యువత దారిపొడవునా చేరి ఆమె రాక కోసం ఎదురుచూశారు. నూజివీడు, తిరువూరు, నందిగామ సభల్లో మాట్లాడి మిగిలిన చోట్ల రోడ్‌షో నిర్వహించి ముందుకు సాగారు. రెడ్డిగూడెం, విస్సన్నపేట, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాల్లో ప్రజలు అభిమానంతో అడ్డుకోవడంతో కాదనలేక  ప్రసంగించారు. తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆయా సభల్లో ప్రజలను కోరారు.
     
    షర్మిల వెంట నేతలు..
     
    జంక్షన్‌లో ఏలూరు లోక్‌సభ నియోజకవర్గం సమన్వయకర్త తోట చంద్రశేఖర్, మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గ సమన్వయకర్త కేవీఆర్ విద్యాసాగర్, గన్నవరం నియోజకవర్గ  సమన్వకర్త దుట్టా రామచంద్రరావు, పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్త పడమట సురేష్‌బాబు,  వైద్యవిభాగం రాష్ర్ట కన్వీనర్ గోసుల శివభరత్‌రెడ్డి షర్మిలను కలిసి యాత్రలో పాల్గొన్నారు. కాగా, గన్నవరంలో బస చేసిన ప్రాంతానికి తరలివచ్చిన గన్నవరం నియోజకవర్గంలోని జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను షర్మిలకు పరిచయం చేశారు.

    రెడ్డిగూడెం సభలో మాట్లాడిన షర్మిల అనంతరం కొత్తరెడ్డిగూడెంలో ఇటీవల మృతి చెందిన పార్టీ మండల కన్వీనర్ రేగళ్ల సత్యనారాయణ ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి వ్యక్తం చేశారు. అదే ఊరిలో ఓ మూగ మహిళ షర్మిలను కలిసి కన్నీరుమున్నీరుగా విలపించింది.  జగనన్న సీఎం అయిన తరువాత ఆదుకుంటామని ఆమెకు భరోసా ఇచ్చారు. విస్సన్నపేటలో మాట్లాడిన షర్మిల తిరువూరు సభలో పాల్గొన్నారు. మైలవరం మీదుగా రోడ్ షో నిర్వహించిన షర్మిల ఇబ్రహీంపట్నంలో మాట్లాడారు. ఆ తర్వాత నందిగామలో మాట్లాడుతూ రానున్న అన్ని ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
     
    ఒక్క క్షణం వైఎస్‌ను తలచుకోండి
     
    మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికల్లో మీరంతా ఒక్క క్షణం దివంగత వైఎస్‌ను తలుచుకోవాలని ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలని షర్మిల కోరారు. చంద్రబాబుకు నిజం చెప్పే అలవాటు లేదని, అబద్ధాలకోరని, అందుకే ఉచిత హామీలు ఇచ్చి ఎన్నికల అనంతరం వాటిని మరిచిపోతారని షర్మిల ఎద్దేవా చేశారు. వాడీవేడిగా సాగిన ఆమె ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. ప్రతీ మాటకు జనం కేరింతలు కొట్టడం విశేషం.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement