నేడు షర్మిల రాక
- ఉయ్యూరులో ప్రచారయాత్ర ప్రారంభం
- 27 సాయంత్రం విజయవాడలో ముగింపు
- మూడు రోజులపాటు ఎనిమిది నియోజకవర్గాల్లో పర్యటన
సాక్షి, విజయవాడ : వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి వైఎస్ షర్మిల మంగళవారం నుంచి జిల్లాలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. సాయంత్రం గుంటూరు జిల్లాలోని తాడేపల్లి మున్సిపాలిటీలో ప్రచారం ముగించుకుని జిల్లాలో ఉయ్యూరుకు చేరుకుంటారు. మూడు రోజులపాటు ఎనిమిది నియోజకవర్గాల్లో పర్యటించి ఆరు మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం చేస్తారు.
తొలిరోజు ఉయ్యూరు నుంచి పెడన వరకు పర్యటన సాగుతుంది. వైఎస్సార్ సీపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా షర్మిల మున్సిపాలిటీల్లో యాత్ర నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఏర్పాటుచేసిన సభల్లో ప్రసంగించిన అనంతరం రోడ్‌షో నిర్వహిస్తారు.
జిల్లాలోని ఉయ్యూరు, పెడన, నూజివీడు, తిరువూరు, నందిగామ, జగ్గయ్యపేట, విజయవాడ నగరంలో ప్రచారం, రోడ్‌షో నిర్వహించనున్నారు. ఈనెల 28తో ఎన్నికల ప్రచారం ముగియనున్న నేపథ్యంలో మున్సిపాలిటీల్లో ప్రచారపర్వం తారస్థాయికి చేరింది.
ఈ క్రమంలో షర్మిల యాత్ర పార్టీకి
మరింత బలం చేకూరుస్తుందని నేతలు ధీమాగా ఉన్నారు. మరోవైపు షర్మిలకు ఘనస్వాగతం పలకడానికి, సభల నిర్వహణకు ఆయా నియోజకవర్గాల సమన్వయకర్తలు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ప్రచారరథం నుంచే ప్రసంగించనున్న క్రమంలో నేతలు అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేపట్టారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను, ప్రోగ్రాం కమిటీ కన్వీనర్ తలశిల రఘురామ్ నేతలతో చర్చించి షెడ్యూల్ ఖరారు చేశారు. మార్గం మధ్యలోనిప్రాంతాల్లో కూడా రోడ్‌షోలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు.
ప్రచారయాత్ర సాగేది ఇలా..
మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు జిల్లాకు చేరుకుంటారు.
అక్కడినుంచి ఉయ్యూరు, ఆరు గంటలకు పెడనలో ప్రచారం చేస్తారు.
26న ఉదయం 10 గంటలకు నూజివీడు, సాయంత్రం నాలుగు గంటలకు తిరువూరు, ఆరు గంటలకు నందిగామలో
27 ఉదయం 10 గంటలకు జగ్గయ్యపేట చేరుకొని అక్కడ ప్రసంగించి ఎన్నికల ప్రచారం చేస్తారు. సాయంత్రం నాలుగుగంటలకు నగరానికి చేరుకొని పర్యటిస్తారు