ఆ నాలుగు అక్షరాలు.. ముగ్గుర్ని రక్షించాయి
ఓ ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుంది.. ఇది ఓ వాణిజ్య ప్రకటన. ఆపదలో ఉన్న ముగ్గురు వ్యక్తులకు వచ్చిన ఓ ఉపాయం వారిని కాపాడింది. గత సోమవారం పసిఫిక్ మహా సముద్రంలో చిన్న పడవలో విహారానికి వెళ్లిన ముగ్గురు వ్యక్తులు పెద్ద ప్రమాదంలో చిక్కుకున్నారు. పెద్ద అల తాకిడికి వారు ప్రయాణిస్తున్న పడవ బోల్తాపడి మునిగిపోయింది. వారు ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈతకొట్టడం మినహా మరో మార్గం కనిపించలేదు. సముద్రంలో రెండు మైళ్ల దూరం ఈతకొట్టి ఫనాడిక్ అనే ద్వీపం తీరానికి చేరుకున్నారు. ఒడ్డుకు అయితే చేరుకున్నారు కానీ అక్కడి నుంచి ఎలా బయటపడాలో తెలియలేదు. మూడు రోజులు అక్కడే ఉండిపోయారు.
ముగ్గురూ తప్పిపోయిన విషయాన్ని కోస్ట్ గార్డ్ సిబ్బంది మంగళవారం గుర్తించారు. నావీ సిబ్బంది సాయంతో వారిని గుర్తించేందుకు రంగంలోకి దిగారు. రెండు కార్గో పడవలతో 17 గంటల పాటు గాలించినా వారి ఆచూకీ కనుగొనలేకపోయారు. ఇంతలో ఆ ముగ్గురికి ఓ ఉపాయం వచ్చింది. సముద్ర తీరంలోని ఇసుకపై తాటి ఆకులను HELP (హెల్ప్) పెద్ద అక్షరాల్లో కనిపించేలా పరిచారు. నావీ విమానంలో గాలిస్తున్న సిబ్బంది గురువారం ఈ దృశ్యాన్ని గుర్తించడంతో వారి కష్టాలు తీరాయి. ఫనాడిక్ ద్వీపంలో చిక్కుకుపోయిన ముగ్గురు సురక్షితంగా పులాప్కు వెనుదిరిగి వచ్చేందుకు ఓ పడవను ఏర్పాటు చేశారు. ఈ ముగ్గురూ సురక్షితంగా తిరిగివచ్చారు. తమను కాపాడిన నావీ, కోస్ట్ గార్డ్ సిబ్బందికి కృతజ్ఞతలు చెప్పారు. రెండు వారాల్లో కోస్ట్ గార్డ్ సిబ్బంది ఆపదలో ఉన్న 15 మందిని రక్షించారు.