మొహాలీలో పాకిస్తాన్ జట్టుకే మద్దతు
మొహాలీ: భారత్ వేదికపై దాయాది పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు అనూహ్య మద్దతు లభిస్తోంది. టి-20 ప్రపంచ కప్‌లో భాగంగా శుక్రవారం మొహాలీలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో అభిమానులు పాక్ టీమ్‌కు మద్దతు తెలిపారు. ఈ మ్యాచ్ ఆరంభానికి ముందు అభిమానులు 'పాకిస్తాన్ జీతేగా', 'అఫ్రిదీ లలా' అంటూ స్టేడియం హోరెత్తిపోయేలా నినాదాలు చేశారు. దీంతో పాక్ టీమ్‌కు స్వదేశంలో క్రికెట్ మ్యాచ్ ఆడుతున్న అనుభూతి కలిగింది.
మొహాలీ స్టేడియంలో 27 వేల సీటింగ్ కెపాసిటీ ఉంది. పాక్-ఆసీస్ మ్యాచ్‌ను తిలకించేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో స్టేడియానికి తరలివచ్చారు. అఫ్రిదీ ఆటను చూసేందుకు వచ్చానని అనంత్‌నాగ్‌కు చెందిన ఆమిర్ అనే యువకుడు చెప్పాడు. అతను దగ్గరలోని రాజ్‌పురాలో చదువుతున్నాడు. పాకిస్తాన్ జట్టు అంటే పెద్దగా ఆసక్తి లేదని, అఫ్రిదీ కోసం వచ్చామని సరబ్ ప్రీత్ అనే యువకుడు చెప్పాడు. పాటియాలాకు చెందిన సరబ్ సోదరుడితో కలసి మ్యాచ్ చూసేందుకు వచ్చాడు. పాక్ జట్టుకు స్థానికులతో పాటు కశ్మీరీ విద్యార్థులు మద్దతు ఇస్తున్నారు. ఇదే ఈవెంట్లో న్యూజిలాండ్, పాక్ మ్యాచ్ కూడా ఈ వేదికలోనే జరిగింది.