Faraaz hossain
-
స్నేహితురాళ్ల కోసం ప్రాణాలర్పించాడు
న్యూఢిల్లీ: స్నేహితురాళ్ల కోసం బంగ్లాదేశ్ యువకుడు ప్రాణాలు ఫణంగా పెట్టాడు. తన ప్రాణాలు కాపాడుకునే వీలున్నా తన నేస్తాల కోసం తనువు చాలించాడు. స్నేహితురాళ్లను విడిపిపెట్టి ప్రాణాలు దక్కించుకోమని ఉగ్రవాదులు చెప్పినా వినకుండా ఫ్రెండ్స్ కోసం నిలిచి వారితో పాటే కడతేరిపోయాడు.స్నేహానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచాడు. ఢాకాలోని రెస్టారెంటుపై ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన భారతీయ యువతి తరుషి జైన్(19)ను కాపాడేందుకు ఆమె ఫరాజ్ హుస్సేన్ స్నేహితుడు ప్రయత్నించాడని వెల్లడైంది. ఉగ్రవాదులు రెస్టారెంట్ లోకి చొరబడినప్పుడు తన ఇద్దరు స్నేహితులు ఫరాజ్ హుస్సేన్, అబింతా కబీర్ తో కలిసి రెస్టారెంటులోని వాష్ రూమ్ లో తరుషి దాక్కుంది. ప్రతిష్టాత్మక ఢాకా స్కూల్ లో చదువుతున్న ఈ ముగ్గురిని ఉగ్రవాదులు కిరాతకంగా హతమార్చారు. చంపడానికి ముందు బయటకు వెళ్లిపోయేందుకు ఫరాజ్ హుస్సేన్ కు ఉగ్రవాదులు అనుమతిచ్చారు. అయితే తన ఇద్దరు స్నేహితులను వదిలి వెళ్లనని చెప్పడంతో 20 ఏళ్ల హుస్సేన్ ను ముష్కరులు చంపేశారని 'ఇండియన్ ఎక్స్ప్రెస్' వెల్లడించింది. తరుషి, అబింత పాశ్చాత్య దుస్తులు ధరించడంతో వీరు ఎక్కడి నుంచి వచ్చారని హుస్సేన్ ను ఉగ్రవాదులు ప్రశ్నించగా... భారత్, అమెరికాకు చెందిన వారని అతడు సమాధానం ఇచ్చినట్టు తెలిపింది. ఉగ్రవాదులు చొరబడిన వెంటనే వాష్ రూములో దాక్కుని ప్రాణాలు కాపాడుకున్నానని కుక్ గా పనిచేస్తున్న సుమిర్ బరాయ్ వెల్లడించాడు. 'బెంగాలి మాట్లాడేవారంతా బయటకు రండి. బెంగాలీలు భయపడాల్సిన పనిలేదు. బెంగాలీలను చంపం. విదేశీయులను మాత్రమే చంపుతాం' అంటూ ఉగ్రవాదుల్లో ఒకడు గట్టిగా అరిచాడని 'న్యూయార్క్ టైమ్స్'తో బరాయ్ చెప్పాడు. తమ ఘాతుకాన్ని సోషల్ మీడియాలో చూడాలని ఉగ్రవాదులు ఉబలాటపడ్డారని వెల్లడించాడు. 'బందీలను చంపిన తర్వాత వై-ఫై ఆన్ చేయాలని రెస్టారెంట్ సిబ్బందితో చెప్పారు. కస్టమర్ల ఫోన్లు తీసుకుని మృతదేహాల ఫొటోలను ఇంటర్నెట్లో పోస్ట్ చేశార'ని బరాయ్ పేర్కొన్నాడు. -
’స్నేహం కోసం మా సోదరుడు ప్రాణం విడిచాడు’
కోల్కతా: తన సోదరుడిని వెళ్లిపొమ్మని ఉగ్రవాదులు చెప్పినా స్నేహితులను రక్షించుకునేందుకు వారితోనే ఉండి ప్రాణాలుకోల్పోయాడని ఢాకా ఉగ్రదాడిలో చనిపోయిన ఫరాజ్ సోదరుడు జరేఫ్ హుస్సేన్ తెలిపాడు. సమ్మర్ హాలీడేస్ కోసం ఢాకా వచ్చిన అతడు అనూహ్యంగా మృత్యువాత పడ్డాడని చెప్పి కంటతడి పెట్టాడు. ఢాకా ఉగ్రదాడిలో మొత్తం 20 మంది ప్రాణాలుకోల్పోయిన విషయం తెలిసిందే. వారిలో ఫరాజ్ అనే యువకుడు కూడా ఉన్నాడు. శుక్రవారం సాయంత్రం తమ మిత్రుడిని కలుసుకునేందుకు ఫరాజ్, తారుషి జైన్, అబింత కబీర్ కలిసి ఢాకాలోని హోలి ఆర్టిసన్ రెస్టారెంటుకు వెళ్లారు. అక్కడికి తమ మిత్రుడు మిరాజ్ అల్ హక్ ని రమ్మని చెప్పారు. మిరాజ్ లోపలికి వచ్చే సమయం కంటే ముందే ఉగ్రవాదులు ఆ రెస్టారెంటులోకి చొరబడి నరమేధం సృష్టించారు. ఈ సమయంలో ఖురాన్ చదివిన వారిని విడిచిపెడతామని ఉగ్రవాదులు హెచ్చరించారు. అయితే, ఆ విషయం తమ సోదరుడికి కష్టమైన పనేం కాదని, ఉగ్రవాదులు అతడిని వెళ్లిపొమ్మని చెప్పి ఉంటారని, అయితే, స్నేహితులకోసం అలా ఉండిపోయి ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చని తెలిపాడు.