కశ్మీర్‌పై విషం చిమ్మిన మాజీ ముఖ్యమంత్రి
కేంద్ర మాజీమంత్రి, జమ్ము కశ్మీర్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కూడా అయిన ఫరూక్ అబ్దుల్లా కశ్మీర్ విషయంలో విషం చిమ్మారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ ఏమైనా భారత్ 'బాబుగాడి సొమ్మా' అనడమే కాక, నరేంద్రమోదీ ప్రభుత్వానికి దమ్ముంటే ఆ ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలని సవాలు చేశారు. భారతదేశంలో రాజ్యాంగబద్ధమైన పదవులు అనుభవించి కూడా ఫక్తు పాకిస్థానీ ఉగ్రవాది తరహాలో వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ విషయంలో పాకిస్థాన్ కూడా స్టేక్‌హోల్డర్లలో ఒకటని, ఆ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా గతంలో ఆమోదించిందని అన్నారు. దీనిపై ఒక ఒప్పందం కూడా ఉందని.. దాని ప్రకారం పీఓకే అనేది భారతదేశంలో భాగమని చెబుతూనే.. ఈ విషయంలో భారత ప్రభుత్వానికి పాకిస్థాన్‌తో చర్చలు జరపడం తప్ప మరో మార్గం లేదని వ్యాఖ్యానించారు. జమ్ము కశ్మీర్ రాష్ట్రంలో ప్రజలు అనుభవిస్తున్న కష్టాలు తొలగాలంటే అదొక్కటే మార్గమన్నారు. పాకిస్థాన్ నుంచి పీఓకేను లాక్కునే దమ్ము భారత ప్రభుత్వానికి లేదని, అలాగే భారతదేశం నుంచి కశ్మీర్‌ను లాక్కునే ధైర్యం పాకిస్థాన్‌కు లేదని ఫరూక్ అబ్దుల్లా అన్నారు. వీరిద్దరి మధ్య అమాయకులైన కశ్మీర్ ప్రజలు నలిగిపోతున్నారన్నారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ తల్లి బ్యాంకుకు వెళ్లి డబ్బు మార్చుకున్న అంశంపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. మంచి కొడుకు ఎవరైనా తల్లి కష్టపడకూడదని అన్నీ త్యాగం చేస్తాడని.. తాను తీసుకున్న నిర్ణయం (పెద్దనోట్ల రద్దు) కారణంగా కలిగిన అసౌకర్యానికి ఆయన ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పెళ్లి చేసుకోనివాళ్లకు కూతురి పెళ్లి కష్టాలు ఎలా తెలుస్తాయని, రూ. 2.50 లక్షలతో పెళ్లి ఏర్పాట్లు చేయడం ఎలా సాధ్యమని పరోక్షంగా కూడా మోదీని విమర్శించారు.