పనుల వేగవంతానికి మరిన్ని యంత్రాలు
హిరమండలం: వంశధార రిజర్వాయర్ పనుల వేగవంతానికి మరిన్ని యంత్రాలను పెట్టినట్లు వంశధార ఈఈ సీతారాం నాయుడు, పాలకొండ ఆర్డీవో రెడ్డి గున్నయ్యలు తెలిపారు. శనివారం పాడలి తులగాం రెవెన్యూ పరి ధిలోని వరినాట్ల తొలగింపు, పొలం గట్లు చదును పనులను వారు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు రెండు రెవెన్యూ పరిధిలో భూ సేకరణకు అవసరమైన మట్టి సేకరణకు అడ్డుగా ఉన్న పొలాలను చదును చేసేందుకు 8 పొక్లెయిన్లు, సుమారు 25 ట్రాక్టర్లను తెచ్చామన్నారు.
ప్రభుత్వం నిర్ణయించిన సమయానికి పనులు పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నారన్నారు. నిర్వాసితులకు సమస్యలు ఉంటే ప్రతిశనివారం ప్రత్యేక సెల్లో చెప్పుకోవాలని సూచించారు. ఇన్చార్జి డీఎస్పీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ పనులు సజావుగా జరిగేందుకు పోలీసు బలగాలను మోహరించామని అవసరమైతే మరిన్ని బలగాలను తెచ్చి శాంతి భద్రతకు విఘాతం కలగకుండా పనులు చేయిస్తామన్నారు. వీరితో పాటు తహసీల్దార్ ఎం.కాళీప్రసాద్, డీఈ బ్రహ్మానందం పలువురు వంశధార, రెవెన్యూ, పోలీసు అధికారులు ఉన్నారు. దుగ్గుపురంలో దళితుల ఇళ్లకు నష్ట పరిహారం చెల్లించాలని పలువురు కోరారు.