కంటిరెప్పే కాటేసింది!
కన్నకూతురిపై తండ్రి అత్యాచారం
పాతపోస్టాఫీసు (విశాఖ దక్షిణ): కన్నకూతురిని కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కాటేశాడు. మైనర్ కూతురిమీదే అత్యాచారానికి ఒడిగట్టిన ఆ కామాంధుడిని ఒకటో పట్టణ పోలీసులు మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. ఏసీపీ రంగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. కదిరి ధనరాజు (42) అనే వ్యక్తి భార్య, బిడ్డలతో కలసి జాలరిపేటలో నివసిస్తున్నాడు.
గతంలో కేర్ ఆసుపత్రిలో వాచ్మెన్గా పనిమానేసిన అతడు కొంతకాలంగా ఇంటి వద్దే ఉంటున్నాడు. తాగుడుకు బానిసై కన్నకూతురిపై ఐదు నెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. విషయం ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరించడంతో ఆ మైనర్ బాలిక కిమ్మనకుండా తండ్రి కసాయి చర్యలు భయంతో, బాధతో భరించింది. పదిహేను రోజుల క్రితం కన్న తండ్రే కూతురిపై అత్యాచారానికి పాల్పడటాన్ని తల్లి గమనించి అతన్ని నిలదీసింది. అతను చంపుతానని బెదిరించడంతో కూతురిని తీసుకుని చెల్లెలు ఇంటికి వెళ్లిపోయింది. బంధువులు ఇచ్చిన ధైర్యంతో మంగళవారం రాత్రి ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిజానిజాలు రాబట్టిన తరువాత ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిందితుడిని రిమాండ్కు తరలిస్తామని పోలీసులు తెలిపారు.