నాన్న చనిపోయాడని బాధతో..
సాక్షి, చైతన్యపురి: మానసిక స్థితి సరిగాలేని ఓ మహిళ భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బుధవారం. సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ మన్మధకుమార్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. విజయవాడ, గాంధీనగర్‌కు చెందిన గుర్రం సురేష్‌కు, కరీంనగర్ జిల్లా, గండీరావుపేటకు చెందిన బ్యాంక్ ఉద్యోగి విజయకుమార్, శశికళ దంపతుల కుమార్తె శ్రీలేఖ (38)తో 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు ధీరజ్(11). సురేష్ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీరుగా ఉద్యోగం చేసేవాడు. కుమారుడికి సెలవులు ఇవ్వటంతో ఈనెల 1న కుటుంబంతో సహా హైదరాబాద్ వచ్చిన వీరు కొత్తపేట హుడా కాలనీలోని వైశ్యాస్ అపార్టుమెంట్‌లోని మూడో అంతస్తులో ఉన్న శ్రీలేఖ తండ్రికి చెందిన ఫ్లాట్‌లో ఉంటున్నారు.
మంగళవారం తాను పనిచేసే కంపెనీ కార్యాలయానికి వెళ్లిన సురేష్ అర్ధరాత్రి ఇంటికి వచ్చి నిద్రపోయాడు. ఉదయం వాచ్‌మన్ వచ్చి శ్రీలేఖ భవనం పైనుంచి పడి చనిపోయిందని తెలిపాడు. మూడవ అంతస్తు నుంచి దూకడంతో తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. సీఐ శ్రీనివాసరెడ్డి, ఎస్ఐ మన్మధకుమార్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మానసిక స్థితి సరిగాలేకనే...
నాలుగేళ్ల క్రితం తండ్రి చనిపోవటంతో శ్రీలేఖ డిప్రెషన్‌తో బాధపడుతోందని, మతిమరుపు, మానసిక ఆందోళనకు గురైందని మృతురాలి భర్త సురేష్ పోలీసులకు తెలిపాడు. అమెరికాలోనూ చనిపోతాననిని బీచ్‌కు వెళ్లేదని, ఎవరో వస్తున్నారు...ఏదో చేస్తారనే ఆందోళనతో ఉండేదన్నాడు. కొంత కాలంగా చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపాడు. శ్రీలేఖ తల్లి ప్రస్తుతం అమెరికాలోని మరో కుమార్తె వద్ద ఉందని, మంగళవారం కూడా తల్లితో శ్రీలేఖ ఫోన్లో మాట్లాడినట్లు తెలిపాడు. మానసిక స్థితి సరిగాలేకనే ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.