వేదిక మారింది
ఫాతిమా హైస్కూల్లో రాష్ట్రస్థాయి ఇన్స్పైర్
22 నుంచి 24వ తేదీ వరకు కార్యక్రమం
నేడు 22 కమిటీల సభ్యులతో సమావేశం
డీఈఓ విజయకుమార్
విద్యారణ్యపురి : వర్ధన్నపేట మండలం పున్నేలులోని ఏకశిల హైస్కూల్లో నిర్వహించాలనుకున్న తెలంగాణ రాష్ట్రస్థాయి ఇన్స్పైర్ కార్యక్రమం వేదిక మారింది. కాజీపేటలోని ఫాతిమా బాలికల హైస్కూల్లో రాష్ట్రస్థాయి ఇన్స్పైర్ సైన్స్ ఎగ్జిబిట్ల ప్రదర్శనను నిర్వహించనున్నట్టు గురువారం జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ ఎస్.విజయ్‌కుమార్ వెల్లడించారు.
పలు కారణాలతో వేదికను మార్చినట్టు ఆయన తెలిపారు. 22,23,24 తేదీల్లో ఫాతిమా హైస్కూల్లో నిర్వహించనున్న ‘ఇన్స్పైర్’ కోసం ఏర్పాట్లు పూర్తిచేసినట్టు పేర్కొన్నారు. ఇన్స్పైర్ నిర్వహణ కోసం 22 కమిటీలను నియమించామని, అయితే నిర్వహణ వేదిక మారడంతో తక్కువ సమయంలోనే అన్ని ఏర్పాట్లు చేయాల్సి ఉన్నందున శుక్రవారం 19న ఉదయం పది గంటలకు ఫాతిమా గర్ల్స్ హైస్కూల్లో కమిటీ సభ్యుల సమావేశం నిర్వహించనున్నామన్నారు.
బాధ్యులు సకాలంలో హాజరు కావాలని కోరారు. ఏర్పాట్లపై డీఈఓ మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి మొత్తం వెయ్యి సైన్స్ ఎగ్జిబిట్లను ప్రదర్శించనున్నట్టు తెలిపారు. పది జిల్లాల విద్యార్థులు తమ గైడ్ టీచర్లతో కలిసి ఇక్కడికి రానున్నట్టు చెప్పారు.
వీరంతా 21వ తేదీనే వచ్చి తమ పేర్లతోపాటు ఎగ్జిబిట్లకు సంబంధించిన అంశాలతో రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుందన్నారు. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలోనూ స్టాల్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. అవసరమైతే బిషప్ బెరట్టా, సెయింట్ గేబ్రియల్ స్కూళ్లను కూడా ఉపయోగించుకుంటామన్నారు. రాష్ట్రస్థాయిలో ప్రదర్శించిన ఎగ్జిబిట్లలో ఐదుశాతం ఎగ్జిబిట్లను త్వరలో ఢిల్లీలో నిర్వహించనున్న జాతీయస్థాయి ఇన్‌స్పైర్‌కు ఎంపికచేస్తామన్నారు.