మతాచారంపై వ్యాఖ్యలు.. రచయితకు జైలు
కైరో: ఇస్లాం మతాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన కేసులో దోషీగా తేలిన ఫాతిమా నవోత్ అనే సెక్యులర్ రచయితకు ఈజిప్ట్‌లోని ఓ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష, లక్షా 73 వేల రూపాయల జరిమానా విధించింది. శిక్షను వెంటనే అమలు చేయాల్సిందిగా న్యాయస్థానం ఆదేశించినట్టు ఓ ఈజిప్ట్ పత్రిక వెల్లడించింది. ఈజిప్ట్‌లో గత నెల రోజుల్లో మతాన్ని కించపరిచినందుకు జైలు శిక్ష ఎదుర్కొన్న రెండో ప్రముఖ వ్యక్తి ఫాతిమా. ఆమె ఈజిప్ట్ మాజీ పార్లమెంట్ సభ్యురాలు. కాగా ఫాతిమా జైల్లో శిక్షను అనుభవిస్తూనే పైకోర్టులో సవాల్ చేసుకునే అవకాశముంది.
గత అక్టోబర్‌లో ఫాతిమా తన ఫేస్బుక్ పేజీలో ఇస్లాం మతాచారాలను విమర్శిస్తూ పోస్ట్ చేసింది. ఈద్ పర్వదినం సందర్భంగా గొర్రెలను చంపడాన్ని ఆమె తప్పుపట్టారు. 'మానవ జాతి చేస్తున్న అతి కిరాతక వధ' అని ఫాతిమా అభివర్ణించారు. ఇదే అంశంపై ఫాతిమా ఓ పత్రికలో వ్యాసం రాశారు. ఈ ఆచారాన్ని తప్పుపడుతూ ఫేస్బుక్లో తాను కామెంట్ చేసిన మాట వాస్తమేనని, అయితే ఇస్లాం మతాన్ని కించపరచాలన్నది తన లక్ష్యం కాదని ఫాతిమా చెప్పారు. ఈజిప్ట్‌లో ఇలాంటి కేసులోనే ఇస్లాం బెహరీ అనే టీవీ వ్యాఖ్యాతకు గత డిసెంబర్లో జైలు శిక్ష పడింది.