ఎఫ్-35 జెట్లకు సమాధానం ఎఫ్ సీ-31
బీజింగ్: ఐదో తరానికి చెందిన ఫైటర్ జెట్ ను చైనా పరీక్షించినట్లు సోమవారం ఆ దేశ మీడియా పేర్కొంది. ఏళ్లుగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఫైటర్లను తయారుచేస్తూ ఏకచత్రాధిపత్యాన్ని సాగిస్తున్న పశ్చిమ దేశాలకు ఎఫ్ సీ-31తో చైనా చెక్ పెడుతుందని వ్యాఖ్యానించింది. జే-31 జెట్లను మరింత అభివృద్ధి చేసిన చైనా దానికి ఎఫ్ సీ-31 గైర్ ఫాల్కన్ నామకరణం చేసింది. గత శుక్రవారం తొలిసారి గైర్ ఫాల్కన్ గాలిలో విహరించినట్లు చైనా డైలీ పేర్కొంది.
అమెరికా చెప్పుకుంటున్న ట్విన్ ఇంజన్ ఎఫ్-35 జెట్లకు గైర్ ఫాల్కన్ సమాధానం చెబుతుందని తెలిపింది. జే-31 జెట్ ను అభివృద్ధి పరిచే క్రమంలో ఎయిర్ ఫ్రేమ్, రెక్కలు, టెయిల్ భాగాల్లో ఎలక్ట్రానిక్ భాగాలు మార్చినట్లు చెప్పింది. గతంలో కంటే ఇంకా బరువైన పే లోడ్ లను గైర్ ఫాల్కన్ తీసుకెళ్లగలదని తెలిపింది. ఒక్కో జెట్ ను దాదాపు 70 మిలియన్లకు చైనా అమ్మే అవకాశం ఉందని అక్కడి మీడియా పేర్కొంది.