అమెరికా ఆర్థిక వ్యవస్థ ఇంకా కుదుటపడలేదు: యెలెన్
వాషింగ్టన్: అమెరికా ఆర్థిక వ్యవస్థ ఇంకా కుదుటపడలేదని ఆ దేశ ఫెడరల్ బ్యాంక్ చీఫ్ జనెత్ యెలన్ పేర్కొన్నారు. అయితే త్వరలో పరిస్థితులు కుదుటపడతాయన్న విశ్వాసం ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీకి (ఎఫ్ఓఎంసీ) ఉందని వివరించారు. సెనేట్ కమిటీ ముందు ఆమె దేశ ఆర్థిక పరిణామాలపై మంగళవారం వివరణ ఇచ్చారు. ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... మరికొంత కాలం ఫెడ్ ఫండ్ రేటు (ప్రస్తుతం 0.50 శాతం) ఇదే ధోరణిలో కొనసాగే వీలుంది.
అమెరికా పరపతి విధానం పరిస్థితులకు తగిన విధంగా స్పందించడానికి వీలుగా కొనసాగుతోంది. కొన్ని కీలక సమస్యలు చైనాకు పొంచి ఉన్నాయి. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ విడిపోతే (బ్రెగ్జిట్ )ఆ ప్రతికూల ప్రభావం అమెరికా ఆర్థిక వ్యవస్థపై, ఫైనాన్షియల్ స్థిరత్వంపై ఉంటుంది. ఇక వేతన వృద్ధిలో ఇంకా మందగమనం ఉంది. మందగమనం తరువాత గృహ ఆదాయాలు ఇంకా తగిన స్థాయిలో పెరగలేదు. పారిశ్రామిక ఉత్పత్తిలో మందగమనం మరి కొంతకాలం కొనసాగే వీలుంది.