నేటి నుంచి నరసింహుని కల్యాణోత్సవాలు
కోరుకొండ (రాజానగరం) :
రాష్ట్రంలో చారిత్రక ప్రసిద్ధి గాంచిన కోరుకొండ శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి కల్యాణ మహోత్సవాలు బుధవారం నుంచి ఐదు రోజుల పాటు వైభవంగా జరగనున్నాయి. ఈ వేడుకలు అన్నవరం సత్యదేవుని దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. బుధవారం ఉదయాన్నే భక్తులు దేవుని కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి స్వామి వారిని దర్శించుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు స్వామివారిని పెండ్లికుమారుడిగా, అమ్మవారిని పెండ్లికుమార్తెగా అలంకరించి రథంపై ఆసీనులు చేసి, 2 గంటలకు రథోత్సవం జరుగుతుంది. రాత్రి 9 గంటలకు ఆలయంలో పండితుల, అర్చకుల ఆధ్వర్యంలో స్వామివారి కల్యాణం నిర్వహిస్తారు. అన్నవరం ఈఓ కాకర్ల నాగేశ్వరరావు, కోరుకొండ ఆలయ అనువంశిక ధర్మకర్త ఎస్పీ, రంగరాజ భట్టార్ ఆధ్వర్యంలో మహోత్సవాలు జరుగుతున్నాయి. కోరుకొండ తీర్థానికి రాష్ట్రంలో పలు ప్రాంతాల నుంచే భక్తులు తరలివస్తారు.
ముస్తాబైన రథం...
స్వామివారి రథాన్ని ముస్తాబు చేశారు. రథోత్సవంలో వివిధ ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు, దేవతామూర్తుల వేషధారణలు నిర్వహిస్తున్నారు. కోరుకొండ ఉత్తర మండల డీఎస్పీ ఏవీఎల్ ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో సీఐలు, ఎస్సైలు సుమారు 80 మందితో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. గోకవరం, రాజమహేంద్రవరం డిపో నుంచి కోరుకొండ తీర్థానికి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. దేవుని కోనేరు వద్ద స్నానాలు ఆచరించిన తరువాత వస్త్రాలు మార్చుకొనేందుకు తాత్కాలిక గదులు ఏర్పాటు చేశారు. కోరుకొండ తీర్థం ఘనంగా జరిపేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని అన్నవరం దేవస్థానం ఈఓ నాగేశ్వరరావు, ఆలయ అనువంశిక ధర్మకర్త ఎస్పీ రంగరాజ భట్టార్ కోరారు.