అమ్మాయిలకిది సేఫ్ సిటీ
'మీ సిటీలో మహిళల పట్ల చాలా మర్యాదగా వ్యవహరిస్తారు. ఈవ్‌టీజింగ్, అమ్మాయిల్ని అసభ్యంగా కామెంట్ చేయడం ఇక్కడ కనపడవు’ అంటూ ప్రశంసలు గుప్పించారు యువ ఫ్యాషన్ డిజైనర్ నిధి. ఢిల్లీకి చెందిన ఈమె నగరానికి వచ్చారు. బంజారాహిల్స్‌లోని అనహిత బొటిక్‌లో తన ఫెస్టివ్ అండ్ వెడ్డింగ్ తాజా కలెక్షన్‌ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె పంచుకున్న విశేషాలు ఆమె మాటల్లోనే..
నేను ఢిల్లీవాసినే అయినా హైదరాబాద్‌తో బాగా పరిచయం ఉంది. పన్నెండేళ్ల క్రితం నేను ఈ సిటీలోనే నిఫ్ట్‌లో డిజైనింగ్ కోర్సు చేశాను. అప్పుడు మాదాపూర్‌కి ఇప్పటి మాదాపూర్‌కి అసలు పోలికే లేదు. ఎయిర్పోర్ట్ నుంచి వస్తుంటే ఆ రోడ్డు, వెదర్.. ఒహ్.. రియల్లీ బ్యూటీఫుల్. ఈ సిటీ గురించి ప్రధానంగా చెప్పుకోవాల్సిందేమిటంటే... ఇక్కడ ఈవ్‌టీజింగ్ చాలా తక్కువ. మా ఢిల్లీతో పోలిస్తే అసలు లేదనే చెప్పాలి. మహిళల పట్ల హైదరాబాదీలు చాలా మర్యాదగా వ్యవహరిస్తారు. అది నాకు చాలా నచ్చిన అంశం. అందుకే అమ్మాయిలకి ఇది సేఫ్‌సిటీ. ఇక్కడి వారికి ఫ్యాషన్ స్పృహ ఎక్కువే. కలర్స్, ట్రెడిషనల్ వర్క్, హ్యాండ్లూమ్స్ను బాగా లైక్ చేస్తారిక్కడ. ఐదారేళ్లుగా మా లేబుల్‌కు ఈ సిటీలో చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు.
‘పేకాట’ ఫ్యాషన్...
ఈసారి ఢిల్లీ విల్స్ లైఫ్‌స్టైల్ ఫ్యాషన్ వీక్‌లో ప్రదర్శించిన కలెక్షన్స్‌ను ఇక్కడికి తీసుకొచ్చాను. పరిణీతిచోప్రా, ఆలియాభట్, అదితిరావ్ వంటి బాలీవుడ్ సెలబ్రిటీలు ధరించి వాక్ చేసిన డిజైన్లు ఇందులో ఉన్నాయి. ప్లేయింగ్కార్డ్స్ను ఇన్స్పిరేషన్గా తీసుకుని రూపొందించిన ‘హౌస్ ఆఫ్ కార్డ్స్’, క్వీన్ ఆఫ్ హార్ట్స్ వంటి డిజైన్లను ఫ్యాషన్ లవర్స్ లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ర్యాంప్లుక్స్ని కోరుకునే వారికి స్పెషల్ ఇవి.
- ఎస్బీ