సహారా ఆస్తుల విక్రయానికి రంగం సిద్ధం
న్యూఢిల్లీ: సహారా గ్రూప్ ఆస్తులను విక్రయించాలన్న సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాల మేరకు రంగం సిద్ధమైంది. సహారా అధిపతి సుబ్రతో రాయ్ చెల్లించాల్సిన అప్పుల్లో భాగంగా, అన్యాక్రాంతంకాని, తనఖాలోలేని సహారా ఆస్తులను వేలం వేయాల్సిందిగా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) కి మాండేటరీ ఆదేశాలను సుప్రీం జారీ చేసింది. ఈ నేపథ్యంలో సహారా ఆస్తుల ఆన్లైన్లో వేలానికి రంగం సిద్ధమైంది. ఈ వ్యవహారంలో హెచ్డీఎఫ్సీ రియాల్టీ, ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్ (ఎస్బీఐ క్యాప్స్)కు సెబీ నియమించింది. దేశవ్యాప్తంగా 87సహారా ఆస్తులను ఆన్లైన్ ద్వారా వేలం వేసే ప్రక్రియను ఆ సంస్థలు ప్రారంభించాయి. హెచ్డీఎఫ్సీ రియాల్టీ 31 ఆస్తులను వేలం వేయనుండగా, మార్కెట్ ధర ప్రకారం వీటి విలువ దాదాపు రూ.2,400 కోట్ల ధర పలకొచ్చని అంచనా. అటు ఎస్బీఐ కాపిటల్స్ మార్కెట్స్ మరో కొన్ని ఆస్తులను వేలం వేయనుండగా, వీటి మార్కెట్ విలువ దాదాపు రూ.4,000 కోట్లు ఉండొచ్చని అంచనా. అంటే మొత్తం రూ.6,500 కోట్ల ఆస్తులను వేలం వేయనున్నారు. దేశంలోని పలు నగరాల్లోని ప్లాట్లు, వ్యవసాయ, నివాసిత, వాణిజ్య-పారిశ్రామిక భూములు వంటివి ఈ ఆస్తుల్లో ఉన్నాయి. ప్లాట్లను ఆన్లైన్ ద్వారా వేలం వేసే తేదీలను త్వరలో ప్రకటించనున్నారు.
మరోవైపు ఇది భారీ అమ్మకమని గ్లోబల్ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సీనియర్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఈ ప్రక్రియ మూడు నుంచి నాలుగు నెలల్లో పూర్తి అవుతుందని భావిస్తున్నాన్నారు. దేశంలో 30 నగరాల్లో విస్తరించి ఉన్న 87 రకాల ఆస్తులను విక్రయానికి రంగం సిద్దమైందన్నారు. దీనికి సంబంధించిన బ్యాంకు ప్రకటన త్వరలోనే వార్తాపత్రికలలో రావచ్చని సమాచారం. అయితే ఈ విక్రయంలో విదేశాల్లోని మూడు ప్రముఖ హెటెళ్లు, ప్రముఖ ఆంబీ వాలీ రిసార్ట్ ,ముంబైలోని సహారా స్టార్ హెటల్ ను మినహాయించారు.
కాగా ఆర్ధిక నేరాల ఆరోపణలతో సహారా గ్రూప్ అధినేత సుబ్రతో రాయ్ (67) మార్చి 4 , 2014నుంచీ తీహార్ జైల్లో ఉన్నారు. రాయ్కి బెయిల్ మంజూరు చేయాలంటే రూ.5 వేల కోట్ల నగదు, అంతేమొత్తానికి బ్యాంక్ గ్యారెంటీలను సమర్పించాలని, ఇన్వెస్టర్లకు చెల్లించాల్సిన రూ.36 వేల కోట్లను పూర్తిగా చెల్లించాలని సర్వోన్నత న్యాయస్థానం షరతు విధించింది. ఇటీవల ఆయన తల్లి అంత్యక్రియల నిమిత్తం మే 6 న నాలుగు వారాల బెయిల్ (పెరోల్) మంజూరైన సంగతి తెలిసిందే.