‘శ్రీతిరుపతమ్మ’ చైర్మన్‌గిరీ దక్కేదెవరికో?
పెనుగంచిప్రోలు : రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో ఒకటిగా ప్రాచూర్యం పొందిన పెను గంచిప్రోలు శ్రీతిరుపతమ్మ అమ్మవారి ఆలయ ధర్మకర్తల మండలి నియామకం అధికార పార్టీ నాయకులకు పెద్ద తలనొప్పిగా మారింది. ఆలయ ధర్తకర్తల నియామకానికి సంబంధించి దేవాదాయశాఖ నోటిఫికేషన్ విడుదల చేయడంతో చైర్మన్ పదవి కోసం పార్టీ సీనియర్ నాయకుల నుంచే కాక యువ నాయకుల నుంచి కూడా తీవ్ర పోటీ ఎదురౌతోంది.
ఎవరికి వారు నియోజకవర్గ, జిల్లా నాయకులతో తమ అనుయాయులతో కలసి చైర్మన్ పదవి ఇప్పించాలని కోరుతున్నారు. దీంతో పార్టీ అగ్రనాయకత్వం ఏమి చేయాలో తెలియక తికమక పడుతోంది. చైర్మన్ రేసులో గ్రామ టీడీపీ, నీటి సంఘం మాజీ అధ్యక్షుడు, సీనియర్ నాయకుడు కర్ల వెంకటనారాయణ, తెలుగు యువత నాయకుడు నీరుకుండ మృత్యంజయరావు, మరో సీనియర్ నాయకుడు వూట్ల నాగేశ్వరరావు, గ్రామ టీడీపీ అధ్యక్షుడు నల్లపునేని కొండ, నల్లూరి శ్రీను, లింగగూడెం మాజీ సర్పంచి మురుకుట్ల రామారావు పోటీలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఒకవేళ పోటీ మరీ ఎక్కువగా ఉండి, పార్టీ అధిష్టానానికి ఇబ్బందిగా మారిన పక్షంలో అందరికీ అమోద యోగ్యంగా ఉండే ఓ సీనియర్ నాయకున్ని చైర్మన్ పదవి వరించే అవకాశం ఉందని పార్టీ నాయకులు చెబుతున్నారు. మొత్తం మీద నియోజకవర్గంలో ఎమ్మెల్యే తరువాత అంతటి ప్రాధాన్యం ఉన్న చైర్మన్ పదవి ఎవరికి దక్కుతుందోననే ఉత్కంఠ నెలకొంది.