పదిహేనేళ్ల తర్వాత సొంతింటికి..
రామన్నపేట: తప్పిపోయిన ఓ యువకుడు పదిహేనేళ్లకు ఇంటికి చేరుకున్నాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో గురువారం వెలుగు చూసింది. వివరాలు.. మిర్యాలగూడకు చెందిన గౌటి రాజయ్య, లక్ష్మమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఐదుగురు కుమారులు. మూడవ కుమారుడైన గౌటి రాముకు మాటలు సరిగారావు. మిర్యాలగూడలోని బంగారిగడ్డలో తన సోదరి బాలమణి, సోదరుడు వెంకటేశ్వర్లు వద్ద రాము(9), నాలుగో సోదరుడు నర్సింహులు ఆడుకుంటూ ఇతర కాలనీల్లోకి వెళ్లారు.
అనంతరం ఇల్లు దొరక్క రాము తప్పిపోయాడు. అతని ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఫలితం లేకుండా పోయింది. రెండేళ్ల క్రితం రామన్నపేట మండలం ఇంద్రపాలనగరం గ్రామ శివారులో తిరుగుతున్న రామును అదేగ్రామానికి చెందిన సింగనబోయిన గణేష్ ఇంటికి తీసుకువెళ్లాడు. అదే గ్రామంలో రాము మేనత్త ఉంటుంది. ఆమె పిల్లవాడి పోలికలు, ఆనవాళ్లను కొద్దిరోజులుగా గమనించసాగింది.
ఈ విషయాన్ని మిర్యాలగూడలోని రాము సోదరులకు తెలియజేసింది. స్థానిక ఎస్ఐ శీనయ్య, సర్పంచ్ పూస బాలనర్సింహ కుటుంబసభ్యుల వివరాలను పరిశీలించి రామును వాళ్లకు అప్పగించారు. పదిహేనేళ్ల క్రితం తప్పిపోయిన సోదరుడు తమ వద్దకు చేరడంతో కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.