యుద్ధ విమానాల కాంట్రాక్టుపై మిగ్ ఆసక్తి
భారత కంపెనీలతో కలసి పనిచేయడానికి సిద్ధమని వెల్లడి
న్యూఢిల్లీ: భారత నావికా దళం నుంచి వేల కోట్ల రూపాయల విలువైన యుద్ధ విమానాల సరఫరా కాంట్రాక్టు దక్కించుకొనేందుకు రష్యా విమానయాన సంస్థ మిగ్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అవసరమైతే శక్తిమంతమైన మిగ్–29కె యుద్ధ విమానాల అభివృద్ధిలో భారత కంపెనీలతో కలసి పనిచేయడానికి, సాంకేతిక పరిజ్ఞాన బదిలీకి సిద్ధంగా ఉన్నామని వెల్లడించింది. ‘భారత్తో దీర్ఘకాలిక సంబంధాలు కొనసాగించాలని ఆశిస్తున్నాం.
మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంతో పాటు అందుకు ఉన్న వివిధ అవకాశాలను పరిశీలిస్తున్నాం. యుద్ధ విమానాలను సంయుక్తంగా అభివృద్ధి చేసేందుకు సహకరిస్తాం. ఇందుకు సంబంధించి త్వరలోనే భారత ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పిస్తాం’ అని మిగ్ సీఈఓ ఇల్యా టారెసెన్కో చెప్పారు. విమానాల సరఫరా, సేవలకు సంబంధించి యాభై ఏళ్లుగా భారత రక్షణ దళాలతో కలసి మిగ్ పనిచేస్తోందన్నారు.