పెరూ పెద్దావిడ చనిపోయారు
లిమా: పెరూ దేశంలోని అత్యంత వయసున్న వయోవృద్ధురాలు ఫిలోమెనా తైపీ మెండోజా(117) కన్నుమూశారు. ఈ విషయాన్ని అక్కడి అధికార వర్గాలు ప్రకటించాయి. ప్రభుత్వ రికార్డుల ప్రకారం తైపీ 1897లో జన్మించింది. పుకుటో అనే గ్రామంలో ఓ ఇంట్లో నివాసం ఉంటున్న ఆవిడ ఎప్పుడూ ఎంతో ఆరోగ్యంగా ఉండేవారని, ఉల్లాసంగా కనిపించేవారని చెప్పారు. తొమ్మిదిమంది సంతానంగల తైపీ భర్త గతంలోనే చనిపోయాడు. ప్రస్తుతం తన సంతానంలోని ముగ్గురు ఇప్పటికీ బతికే ఉన్నారు.
ఆమె వీధుల్లో నడుస్తూ ఎంతో ఆప్యాయంగా మాట్లాడేదని, చిన్నపిల్లలతో మమేకమయ్యేదని కుటుంబ సభ్యులు తెలిపారు. గత డిసెంబర్లోనే ఆమె 117వ జన్మదినం జరుపుకున్నారని తెలిపారు. ప్రకృతి సిద్ధమైన ఆహార పదార్థాలు తీసుకోవడమే ఆమె ఆరోగ్య రహస్యమని వారు చెప్పారు. ఇప్పటివరకు ఆమె ఎలాంటి బయటి పదార్థాలు తీసుకోలేదన్నారు. న్యూట్రిషన్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా తాను నివాసం ఉంటున్న చోట ప్రతిఒక్కరికీ ఆ జాగ్రత్తలు చెప్పేవారని, ఆమెకు ఇటీవల కాలంలో సన్మానం కూడా జరిగిందని తెలిపారు.