భారీగా పెరగనున్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల జీతాలు
♦ నెలకు రూ.1.50 లక్షల వేతనం
♦ ఇంటి అద్దె రూ.50 వేలు
♦ పింఛన్ కూడా భారీగా పెంపు
♦ త్వరలో వెలువడనున్న ఉత్తర్వులు?
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యుల జీతాలు భారీగా పెరగనున్నాయి. ప్రస్తుతం ఇస్తున్న వేతనాన్ని ఇంటి అద్దెతో కలుపుకుని రెట్టింపు చేయాలని శాసనసభ్యుల సౌకర్యాల కల్పన కమిటీ ప్రభుత్వానికి సూచించింది. సాధారణ పరిపాలన శాఖ ఇప్పటికే ఈ పెంపునకు ఆమోదం తెలిపింది. ఆ శాఖ ఉన్నతాధికారులు సంబంధిత ఫైల్‌పై సంతకాలు చేశారు. ప్రస్తుతం ఫైల్ ఆర్థిక శాఖ వద్ద పెండింగ్‌లో ఉంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతాల పెంపునకు సంబంధించి త్వరలో ఉత్తర్వులు వెలువడనున్నాయి. ప్రస్తుతం ఎమ్మెల్యేలకు నెలకు రూ.95 వేల వేతనం లభిస్తోంది. దాన్ని రూ.1.50 లక్షలకు, ఇంటి అద్దెను రూ.50 వేలకు పెంచనున్నారు. ఈ రెండూ కలిపి ఎమ్మెల్యేలకు రూ.2 లక్షలు వేతన రూపంలో అందేలా ప్రణాళిక సిద్ధం చేశారు.
ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వెంటనే పుస్తకాల కొనుగోలు నిమిత్తం రూ.లక్ష ఒకేసారి చెల్లించనున్నారు. ప్రస్తుతం వాహనం కొనుగోలుకు ఇస్తున్న రుణాన్ని కూడా రెట్టింపు చేయనున్నారు. ఈ మొత్తాన్ని రూ.50 లక్షలకు పెంచనున్నారు. మాజీ ఎమ్మెల్యేలకు ఇచ్చే పింఛన్ మొత్తాన్ని కూడా పెంచాలని నిర్ణయించారు. మూడు, అంతకంటే ఎక్కువసార్లు ఎన్నికైన వారికి నెలకు రూ.50 వేలు పింఛన్ రూపంలో ఇవ్వనున్నారు. ఒకటి, అంతకంటే ఎక్కువసార్లు ఎన్నికైన వారికి రూ.40 వేలు పింఛన్‌గా చెల్లించనున్నారని సమాచారం. ప్రస్తుత బడ్జెట్ సమావేశాలు ముగిసేలోగా ఈ ప్రతిపాదనలను అసెంబ్లీ ముందు ఉంచి ఆమోదం పొందనున్నారు.