రెండు నెలల్లో విజయవాడకు తరలి వెళ్లాల్సిందే..
సాక్షి, హైదరాబాద్ : రెండు నెలల్లోగా ప్రజలతో నేరుగా సంబంధాలుండే శాఖలు విజయవాడకు తరలి వెళ్లాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ప్రధానంగా వైద్య ఆరోగ్య, విద్య, పంచాయతీరాజ్, మున్సిపల్, హోం, వ్యవసాయ అనుబంధ శాఖలన్నీ తక్షణం విజయవాడ వెళ్లేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విజయవాడలో శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో సీఎం ఈ ఆదేశాలు జారీ చేశారు. ఈ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు వారంలో మూడు రోజులపాటు విజయవాడలోనే ఉండాల్సిందిగా బాబు సూచించారు.
మంత్రివర్గ సమావేశాలనూ విజయవాడలోనే నిర్వహిస్తానని, రెండు నెలలకోసారి మాత్రమే హైదరాబాద్‌లో నిర్వహిస్తానన్నారు. మంత్రులు, ఉన్నతాధికారులందరూ విజయవాడ-గుంటూరుల్లో అద్దెకు ఇళ్లను తీసుకోవాలని, అక్కడి నుంచే పాలనను నిర్వహించాలని సూచిం చారు. మంత్రుల ఇళ్ల అద్దె పరిమితులకు మినహాయింపు ఇస్తామని స్పష్టం చేశారు. గతంలో ఉద్యోగుల బదిలీలపై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను నిలుపుదల చేస్తూ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై తన దృష్టికి తీసుకురాకపోవడం పట్ల ఆర్థిక శాఖ అధికారి పీవీ రమేశ్‌పై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రైవేట్ వర్సిటీలకు సంబంధించి బిల్లును కేబినెట్ అజెండాలో చేర్చకపోవడంపైనా అసహనం వ్యక్తం చేశారు. మంత్రులు, కొంతమంది అధికారుల పనితీరుపైనా అసంతృప్తి వ్యక్తం చేశారు.