మొండి బకాయిలపై వాణిజ్య కొరడా
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: సంక్షోభంలో ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గట్టెక్కించే క్రమంలో మొండి బకాయిల వసూలుకు వాణిజ్యపన్నుల శాఖ సిద్ధమవుతోంది. జిల్లాలో కోటి రూపాయల వరకు బకాయిలు పేరుకుపోయిన నేపథ్యంలో వీటి వసూలుకు అవసరమైతే కఠిన చర్యల కొరడా ఝుళిపించేందుకు.. రెవెన్యూ రికవరీ (ఆర్ఆర్) యాక్టు ద్వారా ఆస్తుల జప్తునకు సైతం సిద్ధమవుతోంది. వాస్తవానికి ఈ పద్ధతి ఎప్పటినుంచో అమల్లో ఉన్నా వ్యాపారుల పట్ల మానవతా దృక్పథంతో ఇన్నాళ్లూ వేచి చూసింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఇక ఉపేక్షించకూడదని నిర్ణయించుకుంది. జిల్లాలో వాణిజ్యపన్నుల శాఖకు శ్రీకాకుళం, రాజాం, కాశీబుగ్గ (పలాస), నరసన్నపేటల్లో నాలుగు సర్కిళ్లు ఉన్నాయి. వీటి పరిధిలో వేలాది మంది వ్యాపారులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.
శ్రీకాకుళం సర్కిల్ పరిధిలోని శ్రీకాకుళం, గార ప్రాంతాల్లో 20 నుంచి 30 ఏళ్ల క్రితం వివిధ వర్గాల వ్యాపారులు సుమారు రూ.30 లక్షల పన్నులు బకాయి పడ్డారు. ఇలా జిల్లా వ్యాప్తంగా సుమారు రూ. కోటి వరకు బకాయి ఉన్నట్టు తెలిసింది. బకాయిదారుల జాబితా లో నష్టాలబాట పట్టి పన్ను ఎగ్గొట్టిన వారు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోయిన వారూ ఉన్నారు. విచిత్రమేమిటంటే పన్ను ఎగ్గొట్టినవారిలో బడా కాంట్రాక్టర్లతో పాటు సినిమా థియేటర్ల యజమానులు కూడా ఉన్నారు. అప్పట్లో ‘నిల్ రిటర్న్స్’ చూపించినా ఎప్పటికైనా పన్ను కట్టకపోతారా అని అధికారులు ఎదురుచూశారు. 2005కు ముందు వార్షిక టర్నోవర్ పేరిట ఏడాది కాలానికి ఒకసారే అసెస్మెంట్ సమర్పించేవారు. దీనివల్ల వ్యాపారులు పన్ను ఎగ్గొట్టినా మరుసటి ఏడాది మార్చి అంతానికి మాత్రమే అధికారులకు తెలిసేది. ఇలా చాలా కాలంగా జరుగుతుండడంతో బకాయిలు పేరుకుపోయాయని అధికారులు చెబుతున్నారు.
ఆర్ఆర్ అస్త్రం ప్రయోగం
పేరుకుపోయిన బకాయిలు వసూలు చేసుకునేందుకు వాణిజ్యపన్నుల శాఖ అధికారులు రెవెన్యూ రికవరీ యాక్ట్‌ను తెరమీదకు తెచ్చారు. వ్యాపారులు ఏ ప్రాంతానికి చెందినవారో చూసి ఆ ప్రాంత రెవెన్యూ, పోలీస్, సబ్ రిజిస్ట్రార్లకు వారిపై ఫిర్యాదులిస్తున్నారు. విచారణ అనంతరం వ్యాపారుల ఆస్తులను జప్తు చేసుకునేందుకు ముందస్తు నోటీసులు జారీ చేస్తున్నారు. ఈ ప్రాంతంలో వ్యాపారం చేసి పన్ను ఎగ్గొట్టి మరో ప్రాంతానికి వలస వెళ్లిపోయిన వ్యాపారుల వివరాలు కూడా సేకరిస్తున్నామని, నిబంధనల ప్రకారం చ ర్యలు తప్పవని వాణిజ్యపన్నులశాఖ శ్రీకాకుళం సర్కిల్ సీటీవో డా.పి.శైలజారాణి ‘సాక్షి’కి వివరించారు. వ్యాపారుల నుంచి సెక్యూరిటీ బాండ్లు డిపాజిట్ కింద తీసుకున్నప్పటికీ.. వారు బకాయి పడ్డ మొత్తాని కంటే ఈ బాండ్ల విలువ తక్కువగా ఉందని అంటూ, ఈ విషయాన్ని ప్రభుత్వానికి నివేదించామన్నారు.
భారీ లక్ష్యం
రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకునేందుకు ప్రభుత్వం వాణిజ్యపన్నుల శాఖపై భారీగా లక్ష్యాలను మోపుతోంది. రెవెన్యూ విభాగం ఉన్న ఈ శాఖకు గత ఏడాది మీద 20 నుంచి 30 శాతం ఎక్కువ ఆదాయం లక్ష్యంగా నిర్దేశించిందని అధికారులు తెలిపారు. గత ఏడాది జూలైలో రూ.1.95 కోట్ల రెవెన్యూ సాధించగా శ్రీకాకుళం సర్కిల్ పరిధిలో ఈ డాది జూలై 31నాటికి రూ.2.30 కోట్లు సాధించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో రూ.7.5 లక్షల నుంచి రూ.50 లక్షల వ్యాపారం చేసే వారిపై టర్నోవర్ టాక్స్ (టీవోటీ), ఏడాదికి సగటున రూ.7.5 లక్షలు చేసే వ్యాపారులు వ్యాట్ పరిధిలోకి వస్తారు. అంతకంటే తక్కువ టర్నోవర్ ఉన్న వారిని అసలు పన్ను చెల్లింపు పరిధిలోనే లేకుండా ప్రభుత్వం చట్టం తెచ్చింది. గతంలో ఉన్న ఏపీజీఎస్టీ స్థానంలో ఏపీ వ్యాట్‌ను అమల్లోకి తెచ్చింది.
ఈ నేపథ్యంలో శ్రీకాకుళం సర్కిల్ పరిధిలో 300 మంది కాంట్రాక్టర్లు, 100మంది ధాన్యం/బియ్యం వ్యాపారులు సహా మొత్తం 1300 మంది వ్యాపారులు గుర్తింపు పొందారు. వాస్తవానికి ప్రస్తుతం అన్ని వ్యాపార లావాదేవీలను ప్రభుత్వం ఆన్లైన్ చేసేసింది. జూన్ రెండో తేదీన నుంచి తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలు ఏర్పడటంతో ఇరు రాష్ట్రాల పరిధిలో కొనుగోలు/అమ్మకాలు జరిపిన వ్యా పారుల సంఖ్య తక్కువే. ఇటువంటి వారిని ‘స్టేట్ సేల్ అండ్ సెంట్రల్ సేల్స్ ట్యాక్స్’ కింద పరిగణించే అవకాశం ఉంది. విజయవాడ వంటి పెద్ద నగరాల్లోనే ఈ తరహా వ్యాపారులుంటారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ ఏడాది పన్ను వసూళ్లు కాస్త తగ్గుతాయని భావిం చినా అందుకు భిన్నంగా రూ.2.30 కోట్లు సాధించడంపై అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అదే ఊపుతో గత ఆగస్టులో సాధించిన రూ.3కోట్ల రెవెన్యూను మించి ఈ ఏడా ది రూ.4కోట్లయినా వసూలు చేసేందుకు సిద్ధమయ్యారు.
జోరందుకున్న ఆకస్మిక తనిఖీలు
అక్రమ మార్గంలో సరుకులు తరలించే వ్యాపారులపై అధికారులు కన్నేశారు. చిలకపాలెం జంక్షన్ సహా మరికొన్ని చోట్ల తనిఖీలకు సిద్ధమయ్యారు. వే బిల్లులు లేకపోవడం, తక్కువ మొత్తంలో సరుకును చూపించడం లాంటి అక్రమాలపై కేసు లు నమోదు చేస్తున్నారు. నెలకు రూ.30 లక్షల ఆదాయాన్ని ప్రభుత్వానికి జమ చేస్తున్నారు. శ్రీకాకుళం సర్కిల్ పరిధిలో ఓ సీటీవో, ఓ డీసీటీవో, నలుగురు ఏసీటీవోలు రొటేషన్ పద్ధతిలో తనిఖీలు చేస్తున్నారు. సిబ్బంది కొరతతో పూర్తిస్థాయిలో తనిఖీలు చేయలేకపోతున్నామని, అదనపు ఆదాయ సాధనపై ఇది ప్రభావం చూపిస్తోందని వాపోతున్నారు.