కోట్లాలో సెమీస్‌కు అనుమతి
న్యూఢిల్లీ: టి20 ప్రపంచకప్‌లో భాగంగా ఫిరోజ్ షా కోట్లా మైదానంలో ఈనెల 30న జరగాల్సిన సెమీఫైనల్‌పై ఉత్కంఠ వీడింది. స్టేడియంలోని ఆర్పీ మెహ్రా బ్లాక్‌ను ఉపయోగించుకునేందుకు ఢిల్లీ క్రికెట్ సంఘం (డీడీసీఏ) అనుమతి పొందింది. గతంలో ఈ బ్లాక్‌ను ఉపయోగించుకునేందుకు దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎస్డీఎంసీ)ను ఆదేశించాల్సిందిగా కోర్టుకెక్కిన డీడీసీఏకు నిరాశే ఎదురైంది.
అయితే డీడీసీఏ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు సుప్రీం కోర్టు నియమించిన జస్టిస్ ముకుల్ ముద్గల్‌తో అధికారులు బుధవారం సమావేశమవడంతో సమస్య ఓ కొలిక్కి వచ్చింది. ‘2017 వరకు డీడీసీఏకు అనుమతి లభించింది. సెమీస్‌తో పాటు అన్ని ఐపీఎల్ మ్యాచ్‌లు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయి. ఇక్కడ మ్యాచ్‌లకు ఎలాంటి న్యాయపరమైన సమస్యలు ఉండవని ముద్గల్ ఒప్పించారు’ అని డీడీసీఏ అధికారి ఒకరు తెలిపారు. దీంతో ఆర్పీ మెహ్రా బ్లాకులోని 1800 టిక్కెట్లను అమ్మే అవకాశం ఉంది.