రేపు సచివాలయంలోకి సీఎం
ఉదయం 8:09 గంటలకు ముహూర్తం
ఒకటో బ్లాకు మొదటి అంతస్తులో చాంబర్ సిద్ధం
సాక్షి, అమరావతి: వెలగపూడి సచివాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయం ఈ నెల 12వ తేదీన ప్రారంభం కానుంది. ఆరోజు ఉదయం 8 గంటల 9 నిమిషాలకు శాస్త్రోక్తంగా అందులోకి అడుగుపెట్టాలని చంద్రబాబు నిర్ణయించారు. సచివాలయ భవన సముదాయంలోని ఒకటో బ్లాకు మొదటి అంతస్తులో ఈ కార్యాలయం ఉంది. సీఎం చాంబర్, సమావేశ మందిరాలు, కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఒకేచోట ఏర్పాటు చేశారు. విజయదశమి తర్వాత సచివాలయం నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తానని ముఖ్యమంత్రి కొద్దిరోజుల క్రితం చెప్పడంతో అప్పటినుంచి ఆగమేఘాల మీద పనులు చేసి ఎట్టకేలకు పూర్తయిందనిపించారు.
ఇటీవల సీఎం ఒకసారి చాంబర్‌ను సందర్శించి పలు మార్పులు సూచించడంతో కొన్ని గోడలను పగులగొట్టారు. భద్రతాపరంగా ఉన్నతాధికారులు చేసిన కొన్ని సూచనలకు అనుగుణంగా కూడా మార్పులు చేశారు. చిన్న చిన్న పనులు మినహా దాదాపు పూర్తి కావడంతో ప్రారంభించడానికి రంగం సిద్ధం చేశారు. ప్రస్తుతం విజయవాడలోని క్యాంపు కార్యాలయం నుంచి సీఎం కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. సచివాలయంలో చాంబర్‌ను ప్రారంభించిన తర్వాత కూడా దాన్ని కొనసాగించనున్నారు. ఇలావుండగా దేవాదాయ శాఖ కార్యాలయాన్ని కూడా ఈ నెల 12వ తేదీనే ఆ శాఖ మంత్రి పి.మాణిక్యాలరావు ప్రారంభించనున్నారు. ఇప్పటికే పలు శాఖలు ప్రారంభమైన సంగతి తెలిసిందే.