మార్చి 9 నుంచి అసెంబ్లీ సమావేశాలు
- 22 రోజులపాటు సాగనున్న బడ్జెట్ సమావేశాలు
- మార్చి 18న సభ ముందుకు బడ్జెట్
- మిత్రపక్షాలు, ప్రతిపక్షాల సహకారం ఉంటుందా?
సాక్షి, ముంబై: రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి బడ్జెట్ సమావేశాలు మార్చి 9 నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర బడ్జెట్ను మార్చి 18న సభలో ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి గిరీశ్ బాపట్ తెలిపారు.
చివరి బడ్జెట్ సమావేశాలను గత ప్రభుత్వం 24 రోజుల పాటు నిర్వహించిందని ఆయన చెప్పారు. శాసన సభ వ్యవహారాల కమిటీ తీవ్ర కసరత్తు తర్వాత తుది మెరుగులు దిద్ది ఈ షెడ్యూల్ రూపొందించినట్లు ఆయన పేర్కొన్నారు. అయితే అంతకన్నా కనీసం ఒక్కరోజైనా ఎక్కువగా సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావించినప్పటికీ సమయాభావం వల్ల కేవలం 22రోజుల పాటు (మార్చి 31 వరకు) సభా కార్యకలాపాలు నిర్వహించేలా షెడ్యూల్ రూపొందిచినట్లు వెల్లడించారు. ఫడ్నవీస్ ప్రభుత్వానికి బడ్జెట్ సమావేశాలు మొదటి సారి కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది.
కొత్త ప్రభుత్వం పై గంపెడు ఆశలు పెట్టుకున్న ప్రజలపై పన్నుల రూపంలో వాత పెడతారా అని ఆందోళన చెందుతున్నారు. పాన్సారే హత్యపై ప్రతిపక్షాలతో పాటు మిత్రపక్షాలు కూడా ఫడ్నవీస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఆగని రైతు ఆత్మహత్యలు, కేంద్రం నుంచి అందాల్సిన సహాయం ఇప్పటికీ అందకపోవడం వంటి కీలక అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని యోచిస్తున్నారు. కూటమిలో భాగంగా మిత్రపక్షాలకు ఇచ్చిన హామీలను ఫడ్నవీస్ నెరవేర్చడం లేదని ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు.
శివసేనకు పూర్తిస్థాయి అధికారాలు ఇవ్వకుండా ప్రాధాన్యం లేని శాఖలిచ్చి, ప్రధాన శాఖలన్నీ బీజేపీ దగ్గరే ఉంచుకున్నారని మంత్రులు అసంతృప్తితో ఉన్నారు. కీలకమైన హోంశాఖను ఫడ్నవీస్ దగ్గరే ఉంచుకోవడం జీర్ణించుకోలేకపోతున్నారు. గతంలో నాగపూర్లో జరిగిన అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో కాంగ్రెస్, ఎన్సీపీ ప్రభుత్వంలో జరిగిన నేరాలు, అవినీతి, అక్రమాలను బీజేపీ నిలదీసింది. ఇప్పుడు కాంగ్రెస్, ఎన్సీపీలు పాన్సారే హత్యను బీజేపీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు అస్త్రంగా వాడుకోవాలని చూస్తున్నారు.
అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు కావస్తున్నా మిత్రపక్షమైన శివసేనతో సత్సంబంధాలు ఏర్పరచుకోవడంలో సఫలీకృతం కాలేదు. ఎన్నికలకు ముందు ఆర్పీఐ అధ్యక్షుడు రాందాస్ ఆఠావలేకు, శేత్కరి అధ్యక్షుడు రాజుశెట్టికి ఇచ్చిన హామీల ఊసు ఇంతవరకు ఎత్తకపోవడంతో వారు కూడా సమావేశాలకు ఎంతవరకు సహకరిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది.