దళితద్రోహి కేసీఆర్..
వికారాబాద్ : టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే తొలి ముఖ్యమంత్రిగా దళితుడినే చేస్తానన్నా కేసీఆర్ మాటతప్పి చరిత్రలో దళిత ద్రోహిగా మిగిలిపోయారని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు మందకృష్ణ మాదిగ తీవ్రస్థాయిలో ధ ్వజమెత్తారు. శనివారం స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భూపంపిణీకేవలం ఆర్భాటమే తప్ప అమలులో చిత్తశుద్ధి లేదన్నారు. 2004 ఎన్నికల మేనిఫెస్టోలో ఐదెకరాలు ఇస్తానన్న కేసీఆర్ 2014 ఎన్నికల్లో మూడెకరాలకు దిగారని ఆయన విమర్శించారు.
దళిత ఉప ముఖ్యమంత్రి రాజయ్య తన శాఖ పరిధిలో హెల్త్ వర్సిటీకి కృషి చేస్తానని వరంగల్లో చెప్పినందుకే కేసీఆర్ బహిరంగ సభలో రాజయ్యను అవమానించారని ఆయన ఆగ్రహించారు. దళితులను మోసం చేసి ఆధికారం లోకి వచ్చిన కేసీఆర్ ఇప్పుడు అవమానలకు గురిచేస్తున్నారన్నారు. ఎస్సీ రిజర్వేషన్అమలుకు సంబంధించి టీఆర్ఎస్ ప్రభుత్వం తమ వైఖరిని బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వారం రోజుల నుంచి కేసీఆర్ను కలవడానికి ప్రయత్నించినా అపాయింట్మెంట్ ఇవ్వకపోవటం సిగ్గుచేటన్నారు.
2010లో ఎస్సీ వర్గీకరణకు అనుకూలమని ప్రధానికి లేఖ రాసిన కేసీఆర్ ఇప్పుడు ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు. కీలకమైన సాంఘీక సంక్షేమ, బీసీ సంక్షేమ శాఖలను కేసీఆర్ తన దగ్గరే పెట్టుకోవడాన్ని చూస్తుంటే ఆయన దేశంలో ఎక్కడా లేని సంప్రదాయాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్నట్లుగా కనిపిస్తోందన్నారు. బతుకమ్మ ఉత్సవాలను ప్రభుత్వం నిర్వహిస్తున్నా కేసీఆర్ కేబినేట్లో ఒక్క మహిళా మంత్రి లేకపోవడం సిగ్గుచేటన్నారు. ఎస్సీ వర్గీకరణపై తమ పోరాటాన్ని కొనసాగిస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ సి.అనంతయ్య, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి మద్దిలేటి మాదిగ, ప్రధాన కార్యదర్శి వనం నర్సింహ మాదిగ. జాతీయ కౌన్సిల్ సభ్యులు రావువల్ల బాబుమాదిగ, జిల్లా ప్రధానకార్యదర్శి డప్పు మోహన్ మాదిగ, నాయకులు పెండ్యాల అనంతయ్య, జగదీష్, శంకర్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.