ఈ పోలీస్ చాలా స్టైల్ గురూ!
సినిమా సినిమాకి విభిన్నమైన కథలు ఎంచుకుంటూ టాలీవుడ్లో తన ‘ప్రస్థానం’ కొనసాగిస్తూ ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు శర్వానంద్. తొలిసారి ఆయన వినోదభరితమైన పోలీస్‌గా నటిస్తున్నారు. దర్శకుడు కరుణాకరన్ వద్ద పనిచేసిన చంద్రమోహన్‌ను దర్శకునిగా పరిచయం చేస్తూ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న నేపథ్యంలో శుక్రవారం ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- ‘‘దర్శకుడు చెప్పిన కథ బాగా నచ్చింది.
పూర్తి వినోదాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రమిది. రొమాన్స్, కామెడీ, యాక్షన్ సమపాళ్లలో ఉంటాయి. మాస్ ప్రేక్షకులతో పాటు క్లాస్ ప్రేక్షకులను కూడా అలరిస్తుందనే నమ్మకం ఉంది. ఇప్పటివరకూ చూడని శర్వానంద్‌ను ఈ చిత్రంలో చూస్తారు. చాలా స్టైలిష్‌గా కనిపిస్తారు. మొదటి షెడ్యూల్ చాలా బాగా వచ్చింది. ఈ నెల 15 నుంచి రెండో షెడ్యూల్ జరపనున్నాం. రధన్ పాటలు ప్రేక్షకులను అలరిస్తాయి. కార్తీక్ ఘట్టమనేని కెమేరా పనితనం చాలా రిచ్‌గా ఉంటుంది. టైటిల్, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో చెబుతాం. ఈ ఏడాది ద్వితీయార్ధంలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని తెలిపారు.