ఈవీఎంల కేటాయింపు
సాక్షి, కాకినాడ : వచ్చే నెల ఏడో తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి 4056 పోలింగ్ స్టేషన్లకు 11 వేల 204 బ్యాలట్ యూనిట్లు, 8914 కంట్రోల్ యూనిట్లను కేటాయించినట్టు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నీతూ ప్రసాద్ చెప్పారు. కలెక్టరేట్ కోర్టుహాల్లో శుక్రవారం ఎలక్ట్రానిక్ ఓటింగు మెషీన్ల ప్రథమ ర్యాండమైజేషన్ నిర్వహణ నీతూప్రసాద్ సారధ్యంలో జరిగింది. ఈ సందర్భంగా 294 యూనిట్లు శిక్షణ, అవగాహన నిమిత్తం కేటాయింపులు చేశారు.
ర్యాండమైజేషన్ ప్రక్రియ చేపడుతున్నట్టు ముందుగా అభ్యర్థులకు సమాచారం ఇచ్చినప్పటికీ వారినుంచి పెద్దగా స్పందన లేకపోవడం విశేషం. కాకినాడ పార్లమెంట్‌కు 1491 పోలింగ్ స్టేషన్లుండగా 2982 కంట్రోల్ యూనిట్లు, 289 రిజర్వు నిమిత్తం కేటాయించారు. రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గానికి 853 పోలింగ్ కేంద్రాలకు గాను 1706 కంట్రోల్ యూనిట్లు కేటాయించారు.
అమలాపురం పార్లమెంటుకయితే 1500 పోలింగ్ కేంద్రాలకు గాను కంట్రోల్ యూనిట్లు మూడు వేలు,రిజర్వు 301 వెరసి 3301 కేటాయించగా బ్యాలట్ నిమిత్తం 3213 యూనిట్లు,రిజర్వుకి 161 యూనిట్లు కేటాయించారు. ఇదిలా వుండగా విశాఖ జిల్లా అరకు పార్లమెంట్ పరిధిలో వున్న రంపచోడవరం అసెంబ్లీలో 212 పోలింగ్ కేంద్రాలుండగా 424 కంట్రోలింగ్ యూనిట్లు, 42 రిజర్వు యూనిట్లు కేటాయించారు.
అలాగే బ్యాలట్ కోసం 424 యూనిట్లు,రిజర్వు నిమిత్తం 21యూనిట్లు కేటాయించారు. కార్యక్రమంలో పరిశీలకులు గౌతమ్ ఘోష్, వీరేంద్రకుమార్ సింగ్, ట్రైనీ కలెక్టర్ కన్నన్, డ్వామా పీడీ సంపత్ కుమార్, రాజకీయపార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.