సత్తా చాటిన తెలుగు తేజాలు
ఐసీడబ్ల్యూఏ ఫౌండేషన్ పరీక్షల్లో ర్యాంకుల పంట ఫస్ట్ ర్యాంకర్ సాయిరామ్
విజయవాడ (లబ్బీపేట): కోల్కత్తాలోని ఐసీడబ్ల్యూఏ చాప్టర్ వారు బుధవారం ప్రకటించిన డిసెంబర్-2014, జూన్-2015 ఫౌండేషన్ పరీక్ష ఫలితాల్లో తెలుగుతేజాలు సత్తాచాటాయి. కృష్ణాజిల్లా మచిలీపట్నానికి చెందిన ఏఎన్వీ సాయిరామ్ ఆలిండియా స్థాయిలో మొదటి ర్యాంకు, విజయవాడకు చెందిన పి.ప్రశాంత్, గుంటూరుకు చెందిన పరిశ లక్ష్మి ఆలిండియా స్థాయిలో రెండో ర్యాంకు సాధించారు. వీరంతా విజయవాడలోని సూపర్విజ్లో శిక్షణ పొందిన విద్యార్థులే. ర్యాంకర్లను విజయవాడలోని సూపర్ విజ్ ప్రధాన కార్యాలయంలో ప్రిన్సిపాల్ సబ్బినేని వెంకటేశ్వరరావు అభినందించారు. ఇప్పటి వరకూ సూపర్విజ్ విద్యార్థులు 47 సార్లు ఆలిండియా ఫస్ట్ ర్యాంకు సాధించినట్లు ప్రిన్సిపల్ తెలిపారు.
ఐఏఎస్ నా లక్ష్యం..
మా నాన్న వస్త్ర దుకాణంలో గుమస్తా. ఎంతో కష్టపడుతూ నన్ను ఉన్నతంగా చూడాలనుకుంటున్నారు. ఆయన ఆశయాలను నెరవేర్చేందుకు కృషి చేస్తున్నా. ఆలిండియా స్థాయిలో మొదటి ర్యాంకు వస్తుందని ఊహిం చలేదు. ఇదే స్ఫూర్తితో సీఏ, ఐసీడబ్ల్యూఏ పూర్తి చేసి, సివిల్స్ సాధిస్తా. ప్రస్తుతం సీఏ సీపీటీ, ఐపీసీసీ పూర్తి చేసి ఫైనల్కు ప్రిపేర్ అవుతున్నా. ఐఏఎస్ అవ్వాలనేదే నా లక్ష్యం.
- ఏఎన్వీ సాయిరామ్, ఆలిండియా ఫస్ట్ ర్యాంకర్
ఎమ్మెన్సీ కంపెనీలో ఉద్యోగం చేస్తా
నాన్న లేడు. అమ్మ విజయ ఎంతో కష్టపడి నన్ను చదివిస్తోంది. ఆలిండియా స్థాయిలో రెండో ర్యాంకు రావడం చాలా సంతోషంగా ఉంది. అమ్మ ఇచ్చిన ప్రోత్సాహం, సూపర్విజ్ శిక్షణతో నేడు ఐసీడబ్ల్యూఏలో ఆలిండియా స్థాయిలో రెండో ర్యాంకు సాధించా. ఇదే స్ఫూర్తితో సీఏ, ఐసీడబ్ల్యూఏ పూర్తి చేసి మల్టీ నేషనల్ కంపెనీల్లో ఉద్యోగం సాధించడం నా లక్ష్యం. - పి.ప్రశాంత్, ఆలిండియా రెండో ర్యాంకర్
నాన్న కష్టానికి ఫలితం..
నాన్న రాంబాబు వ్యవసాయం చేస్తుంటారు. పదోవతరగతి తర్వాత సీఏ చేస్తానని అడిగితే కాదనలేదు. కోరుకున్న కోర్సు ఇష్టంగా చదవమని చెప్పారు. నాన్న కష్టానికి ఫలితంగా నేడు ఆలిండియా స్థాయిలో రెండో ర్యాంకు సాధించగలిగాను. దీన్ని నాన్నకు అంకితమిస్తున్నా. ఇదే స్ఫూర్తితో సీఏ, ఐసీడబ్ల్యూఏ పూర్తి చేస్తా. - పి.లక్ష్మి, రెండో ర్యాంకర్