Fisheries development
-
ఏపీ: నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్ న్యూస్
సాక్షి, విజయవాడ: ఏపీలో నిరుద్యోగులకు ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్ అందించింది. నాలుగు ఉద్యోగ నోటిఫికేషన్లను ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు విడుదల చేసింది. 37 ఫారెస్ట్ రేంజ్ అధికారి పోస్టులకు, అయిదు స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులకు, నాలుగు ఫిషరీస్ డెవలప్మెంట్ అధిరారి పోస్టులకు, మూడు ఎలక్ట్రికల్ ఎన్స్పెక్టర్ల పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ వివరాలు ►37 ఫారెస్ట్ రేంజ్ అధికారి పోస్టులకు నోటిఫికేషన్...ఏప్రియల్ 15 నుంచి మే 5 వరకు ధరఖాస్తుల స్వీకరణ. ►అయిదు స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్...ఏప్రియల్ 18 నుంచి మే 8 వరకు ధరఖాస్తుల స్వీకరణ. ►నాలుగు ఫిషరీష్ డెవలప్మెంట్ అధికారి పోస్టులకు నోటిఫికేషన్.. ఏప్రియల్ 23 నుంచి మే 13 వరకు ధరఖాస్తులకు అవకాశం. ►మూడు ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ పోస్టులకు నోటిఫికేషన్.. మార్చ్ 21 నుంచి ఏప్రియల్ 10 వరకు ధరఖాస్తుల స్వీకరణ. చదవండి: యువతరానికి దిక్సూచి ‘భవిత’ -
జనాలకు చేరువగా జల పుష్పాలు.. ఇక ఈజీ!
ఆ వారానికి చేపల నుంచి పీతల మీదకు మనసు మళ్లింది. కానీ ఎలా..? అన్ని ఏరియాల్లో అవి దొరకవే. కొందరికి కంచంలో కారంగా రొయ్యలు కనిపిస్తే గానీ ఆ వీకెండ్ పూర్తవదు. ఏం లాభం..? ఉదయాన్నే మార్కెట్‌పై పడితే గానీ పని జరగదు. అలా కాకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఏవి కావాలంటే అవి దొరికేలా.. మన చెంతనే మీనాల జాతర జరిగితే..? కానాగార్తల నుంచి ఖరీదైన పీతల వరకు అన్నీ మనకు సమీపంలోనే విక్రయిస్తే..? సగటు మనిషి జిహ్వ‘చేప’ల్యం తీరుతుంది కదా. సర్కారు అదే పనిలో ఉంది. అటు మత్స్యకారులకు లాభం కలిగేలా.. ఇటు చేపల వినియోగం మరింత పెరిగేలా ప్రత్యేక యూనిట్లను మంజూరు చేసి రాయితీ నిధులు కూడా కేటాయించింది. సాక్షి, శ్రీకాకుళం: జనాలకు మత్స్య సంపదను మరింతగా చేరువ చేసేందుకు, మత్స్యకారుల విక్రయాలు ఇంకా పెరిగేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సన్నద్ధమయ్యాయి. తోపుడు బళ్లపై కూరగాయలు, పండ్లు విక్రయించినట్టు.. భవిష్యత్‌లో జల పుష్పాలను కూడా జనాలకు చేరువ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. చేపలు, రొయ్యిలు, పీతలు కూడా స్వచ్ఛంగా నాణ్యతతో ప్రజల చెంత ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. మత్స్య ఉత్పత్తుల తలసరి వినియోగాన్ని పెంచేందుకు సరికొత్త పథకాలను రూపొందించింది. నూతనంగా ఆక్వా హబ్‌లు, ఫిష్ కియోస్క్‌లు, రిటైల్ ఔట్ లెట్లు, లైవ్ ఫిష్ వెండింగ్ సెంటర్లు, ఫిష్ వెండింగ్ కం ఫుడ్ కార్ట్లు, ఈ–రిక్షాలు, వ్యాల్యూ యాడెడ్ యూనిట్లు ఏర్పాటు చేయడానికి సర్కారు ఇప్పటికే చర్యలు చేపట్టింది. స్వయం ఉపాధిని కోరుకుంటున్న వారి కోసం ప్రత్యేక రాయితీలతో పథకాలను అమలు చేయనున్నారు. అందుకోసం సమీప గ్రామ/వార్డు సచివాలయాల్లో విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్స్ ద్వారా ఆన్లైన్ ద్వారా ఆసక్తి గల వారి నుంచి దరఖాస్తులను కూడా ఆహ్వానించింది. చదవండి: అయ్యో పాపం.. టీవీ మీద పడటంతో చిన్నారి మృతి శ్రీకాకుళం జిల్లాలో రూ.7.34 కోట్లతో 300 యూనిట్లు.. ♦ అన్ని రంగాలపై పడినట్టే కోవిడ్ ప్రభావం మత్స్య సంపదపై కూడా పడింది. ♦దీంతో అటు గంగపుత్రులను ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించడానికి, జనాలకు మత్స్య సంపదను చేరువ చేసేందుకు ప్రధాన మంత్రి సంపద యోజన పథకం (పీఎంఎంఎస్వై) కింద 300 యూనిట్లు మంజూరయ్యాయి. ♦ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసే క్రమంలో జిల్లాలో లబ్దిదారుల దరఖాస్తులను పరిశీలించి పథకాల అమలుకు చర్యలు చేపట్టింది. ♦ ఇందుకోసం సుమారు 13 విభాగాల యూనిట్లను సిద్ధం చేసి, బీసీ (జనరల్) కేటగిరీకి 40 శాతం, ఎస్సీ, ఎస్టీ, మహిళా కేటగిరీలకు 60 శాతం రాయితీలను కల్పించేలా చర్యలు చేపడుతోంది. ♦జిల్లాలో రాయితీల కోసం రూ.7.34 కోట్లు మంజూరు చేసింది. ఈ పథకాలతో జిల్లాలో ఉన్న 11 మండలాల తీర ప్రాంతాల నుంచి వస్తున్న మత్ప్య ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించాలని భావించిన రాష్ట్ర మత్స్య శాఖ ఈ మేరకు జిల్లాలో దాదాపుగా అన్ని యూనిట్లను ఏర్పాటు చేసి లక్ష్యాన్ని సాధించాలని చర్యలు చేపట్టింది. ♦అలాగే జిల్లా కేంద్రంలో ఒక ఆక్వా హబ్‌ను కూడా రూ.1.85 కోట్లతో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం స్థల సేకరణ పనులు జరుగుతున్నాయి. చదవండి: ఇన్నాళ్లు ఎక్కడున్నావయ్యా.. భర్తను చూడగానే.. తలసరి వినియోగం పెంచేందుకే చేపల తలసరి వినియోగం పెంచేందుకు మత్స్యశాఖలో ఈ పథకాలను అమలు చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ పథకంలో భాగంగా జిల్లాలో 300 యూనిట్లు ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నాం. ఇప్పటికే 50 శాతం నిధులు విడుదలయ్యాయి. సచివాలయాల్లో నవ శకంలో భాగంగా ఆసక్తి ఉన్న వారు ఈ పథకాల్లో లబ్దిదారులుగా తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవచ్చు. వివరాలకు 9346007766 నంబర్‌ను సంప్రదించవచ్చును. – ఎం.షణ్ముఖరావు,జిల్లా ప్రోగ్రాం మేనేజర్, శ్రీకాకుళం -
మత్స్య సంపద వృద్ధికి పీఎంఎంఎస్వై
న్యూఢిల్లీ: దేశ మత్స్య ఎగుమతులు రెట్టింపు చేయడం, రైతు ఆదాయం, మరిన్ని ఉద్యోగావకాశాల కల్పనే లక్ష్యంగా ప్రధాని మోదీ గురువారం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన(పీఎంఎంఎస్వై)ను ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ఈ–గోపాల యాప్, బిహార్‌లో మరికొన్ని పథకాలను ప్రారంభించారు. ఈ పథకం కింద వచ్చే ఐదేళ్లలో రూ.20 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. దీని ద్వారా గ్రామాల అభివృద్ధి, దేశ స్వావలంబనకు వీలవుతుందని చెప్పారు. వచ్చే ఐదేళ్లలో మత్స్య ఉత్పత్తులను రెట్టింపు చేస్తూ..అదనంగా 70 లక్షల టన్నుల మేర ఉత్పత్తిని పెంచి 2024–25 కల్లా ఎగుమతుల ద్వారా లక్ష కోట్ల ఆదాయం సాధించమే లక్ష్యం. 2020–21 నుంచి 2024–25 వరకు అమలయ్యే ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీలో భాగంగా పీఎంఎంఎస్‌వైను రూ.20,050 కోట్లతో అమలు చేస్తారు. ఈ రంగంలో ఉన్న అవకాశాలను వినియోగించుకునేందుకు వీలుగా మత్స్య శాఖను ఏర్పాటు చేయనున్నామన్నారు. ఫిషరీస్‌తోపాటు పాడి పరిశ్రమను అభివృద్ధి చేయడం ద్వారా రైతులు, ఉత్పత్తి దారుల ఆదాయం పెంచుతామన్నారు. ఈ–గోపాలæ యాప్‌లో పశుపోషణ, ఆరోగ్యం, దాణా, ఉత్పాదకత వంటి అంశాలపై సమస్త సమాచారం ఉంటుందన్నారు. ఈ–గోపాల్‌ను యానిమల్ ఆధార్‌కు అనుసంధానం చేస్తామన్నారు. 50 కోట్లకు పైగా పశువులకు ఫుడ్ అండ్ మౌత్, బ్రుసెల్లోసిస్ వంటి వ్యాధులు సోకకుండా ఉచితంగా టీకా వేసే కార్యక్రమాన్ని మోదీ ప్రారంభించారు. -
మత్స్యకారుల వలసలను నివారిస్తాం: అప్పలరాజు
సాక్షి, విశాఖపట్నం: మత్స్య శాఖ అభివృద్ధిపై మంత్రి డా.సిదిరి అప్పలరాజు శనివారం మీడియాతో మాట్లాడారు. సిదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. రాష్ట్రంలో 3వందల నుంచి 350 మిలియన్ టన్నుల ఎగుమతులే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. భావనపాడు, కాకినాడ, మచిలీపట్నం, రామయపట్నం పోర్టుల అభివృద్దికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కాగా శ్రీకాకుళం జిల్లా వెనుకబడిన జిల్లా అనే పేరు వినబడకూడదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పనిచేస్తున్నారని పేర్కొన్నారు. మరోవైపు భావనపాడు పోర్టుని పోర్ట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అనే స్పెషల్ పరపస్ వెహికల్‌ను ఏర్పాటు చేసి, ల్యాండ్ లార్డ్ మోడల్లో నిర్మాణం చేపడతాం అని తెలిపారు. మొదటి దశ 5 వందల ఎకరాల్లో బల్క్ కార్గో పోర్ట్ నిర్మాణం జరుగుతందని, మలి దశలో 2217 ఎకరాల్లో భావనపాడు పోర్ట్ నిర్మాణం జరగుతుందని పేర్కొన్నారు. కాగా భావనపాడు, దేవునల్తాడ గ్రామాలకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి క్రింద నష్టపరిహారం ఇవ్వబడుతుందని పేర్కొన్నారు. మంచినీళ్ల పేట, బుడగట్ల పాలెం వద్ద జెట్టీ నిర్మాణం చేపడతామని, మత్స్యకారుల వలసలను రాబోయే రోజుల్లో నివారిస్తామని తెలిపారు. ఇళ్లు కోల్పోయేవారికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి, పునరావాసం, ఇళ్లస్థలం లేదా ఇళ్లు కట్టుకోవడానికి సరిపడా డబ్బులు కేటాయిస్తామని తెలిపారు. ఇల్లు వద్దనుకునేవారికి వన్ టైం సెటిల్మెంట్ క్రింద పరిహారం ఇస్తామని, రవాణా చార్జీలతో సహా గౌరవప్రదమైన పరిహారం ఇవ్వబడుతుందని సిదిరి అప్పలరాజు పేర్కొన్నారు -
ఆక్వాలో నంబర్ వన్‌కు చేరాలి
సాక్షి, హైదరాబాద్: సముద్ర ఉత్పత్తుల రంగంలో ప్రపంచంలోనే భారత్ రెండోస్థానంలో ఉందని, ఉత్పాదక సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగంలోకి తీసుకురావడం ద్వారా నంబర్ వన్‌కు చేరాలని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. దేశంలో ఉన్న జల వనరులను 40 శాతమే ఆక్వాకల్చర్‌కు వినియోగించుకుంటున్నామని అన్నారు. సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ (ఎంపీఈడీఏ) ఆధ్వర్యంలో శుక్రవారం హైటెక్స్‌లో ఏర్పాటైన ఆక్వాఆక్వేరియా ఇండియా– 2019 ప్రదర్శనను వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ ఆక్వా ఉత్పాదకతను పెంచేందుకు కూడా ఎంపీఈడీఏ లాంటి సంస్థలు, ప్రభుత్వ, పరిశోధనా సంస్థలు కృషి చేయాలని సూచించారు. మెరుగైన ఫిషరీస్ మేనేజ్మెంట్ పద్ధతులను రూపొందించుకుని, ఖచ్చితమైన అమలు కోసం కృషి జరగాలన్నారు. క్షేత్రస్థాయిలో ఆక్వా రైతుల సంక్షేమం కోసం చర్యలు చేపట్టాలని, వారికి లాభాల్లో తగిన వాటా ఉం డేలా విధానాల రూపకల్పన జరగాలన్నారు. దేశంలో ఆహార సమృద్ధి ఉన్నప్పటికీ, ప్రొటీన్ సహిత పోషకాహారంలో సముద్ర ఉత్పత్తులు, సంప్రదాయ ఆహార పద్ధతులే సరైనవని అభిప్రా యపడ్డారు. ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించిన ‘ఫిట్ ఇండియా’ కార్యక్రమం ఉద్యమంగా మారా లని పిలుపునిచ్చారు. ఫిట్నెస్, యోగాలపై దృష్టి పెట్టాలని, ఆహార అలవాట్లను పునఃసమీక్షించుకోవాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం పశు సంవర్థక రంగ అభివృద్ధికి చేపట్టిన చర్యలు అభినందనీయమని ప్రశంసించారు. 60 శాతం విదేశీ మారక ద్రవ్యం ఏపీ నుంచే... సువిశాల సముద్రతీరమున్న ఆంధ్రప్రదేశ్ నుంచే ఆక్వారంగంలో 60 శాతం విదేశీ మారకం వస్తోందని ఆ రాష్ట్ర పశుసంవర్థక మంత్రి మోపిదేవి వెంకటరమణ వెల్లడించారు. ఏపీలో 14.5 లక్షల మంది ఈ రంగంతో ఉపాధి పొందుతున్నారని చెప్పారు. ప్రస్తుతం ఈ రంగం ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో డీజిల్ రాయితీ పెంపు తోపాటు నాణ్యమైన సీడ్‌ను ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. మెరైన్ రంగంలో మార్పులు చేసి ఆధునిక పరిజ్ఞానాన్ని మత్స్యకారులకు అందుబాటులోకి తేవాలన్నారు. అభివృద్ధికి పలు చర్యలు... తెలంగాణలో మత్స్యరంగ అభివృద్ధికి పలు చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర పశుసంవర్థక మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ చెప్పారు. ముఖ్యమం త్రి కేసీఆర్ మత్స్యరంగ అభివృద్ధికి అధిక ప్రాధా న్యం కల్పించినట్లు తెలిపారు. ఇంటిగ్రేటెడ్ ఫిషరీస్ అభివృద్ధి పథకం కింద మత్స్యకారులకు 70–90 శాతం రాయితీతో పరికరాలు సమకూరుస్తున్నట్లు తెలిపారు ఎంపీఈడీఏ అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ ఆక్వారంగ అభివృద్ధి కోసం ప్రభుత్వం, ప్రైవేట్ రంగం అమలు చేస్తున్న చర్యలను వివరించారు. ఈ సందర్భంగా ఆక్వా రంగంలో విశేష కృషి చేసిన 10 మంది రైతులకు ఉపరాష్ట్రపతి పురస్కారాలు అందజేశారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్, చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, పశుసంవర్థక కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, కమిషనర్ సువర్ణ, వివిధ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రదర్శనలో 200 స్టాళ్లను ఏర్పాటు చేశారు. -
మత్స్యరంగ అభివృద్ధికి నూతన పాలసీ: తలసాని
సాక్షి, హైదరాబాద్: మత్స్యరంగ సమగ్ర అభివృద్ధి కోసం త్వరలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో నూతన పాలసీని తీసుకురానున్నట్లు రాష్ట్ర పశు సంవర్థక, మత్స్య, పాడిపరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ వెల్లడించారు. సోమవారం ఇక్కడ హరితప్లాజాలో మత్స్యశాఖ ఏర్పాటు చేసిన పార్ట్నర్షిప్ సమ్మిట్‌ను మంత్రి శ్రీనివాసయాదవ్, రాజ్యసభ సభ్యులు బండ ప్రకాష్ ముదిరాజ్, పశుసంవర్థక శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, కమిషనర్ సువర్ణ, సలహాదారు విజయ్‌గుప్తాలతో కలసి ప్రారంభించారు. మత్స్యరంగంలోని వివిధ విభాగాలలో అనుభవం ఉన్న గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తదితర రాష్ట్రాలకు చెందిన సుమారు 40 ప్రముఖ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను కమిషనర్ సువర్ణ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ మత్స్యరంగ అభివృద్ధికి, లక్షలాది మంది మత్స్యకారుల జీవన ప్రమాణాలను పెంచేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలను రూపొందిస్తోందన్నారు. 4 వేల మత్స్య సొసైటీల్లో సభ్యులుగా ఉన్న 2.90 లక్షల మంది లబ్ధి పొందుతున్నారని మంత్రి వివరించారు. దేశంలోనే మొదటిసారిగా రాష్ట్రంలో 100 శాతం గ్రాంటుపై అన్ని నీటి వనరులలో చేపపిల్లలను విడుదల చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. 2016–17 సంవత్సరంలో రూ. 22 కోట్ల ఖర్చుతో 3,939 జలాశయాలు, చెరువుల్లో 27 కోట్ల చేపపిల్లలను, 2017–18 సంవత్సరంలో 51 కోట్ల చేపపిల్లలను 11,067 నీటి వనరులలో 42 కోట్ల రూపాయల ఖర్చుతో విడుదల చేసినట్లు మంత్రి వివరించారు. వీలైనంత త్వరలో ఒక కమిటీని ఏర్పాటు చేసి నూతన పాలసీని రూపొందించనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ఆక్వా కల్చర్, సీడ్ హేచరీస్, ఎక్స్పోర్ట్, మార్కెటింగ్ తదితర రంగాల్లో ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్లాలనే ఆలోచనతో ఉందన్నారు. ఆధునిక టెక్నాలజీ అందిపుచ్చుకోవాలి: సమ్మిట్‌లో ప్రముఖ కంపెనీలు మత్స్య ఉత్పత్తిని మెరుగుపర్చడం, నాణ్యమైన చేపలను వినియోగదారులకు అందించడం, మార్కెటింగ్ వ్యవస్థను పటిష్టపర్చడం అవసరమని ఆయా కంపెనీల ప్రతినిధులు పేర్కొన్నారు. తెలంగాణలో ఆక్వా రీసెర్చ్ సెంటర్‌ను ఏర్పాటు చేసి రైతులకు శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాలని కోరారు. చేపలు, రొయ్యల పెంపకానికి నార్మల్, ఫుల్ కవరేజీ ఇన్సూరెన్స్ ఉందని, దీనికి ప్రభుత్వ సహకారం అవసరమని తెలిపారు. మత్స్యరంగానికి సరఫరా చేసే విద్యుత్ యూనిట్‌కు 3 రూపాయల 40 పైసలు తెలంగాణలో వసూలు చేస్తున్నారని, అదే ఒడిశాలో రూపాయి 25 పైసలు మాత్రమే వసూలు చేస్తున్నారని, దీనిని ప్రభుత్వం పరిశీలించాలని కోరారు. సింగిల్‌విండో విధానంలో మార్కెటింగ్ వ్యవస్థను నిర్వహించాలని సూచించారు. -
మత్స్య అభివృద్ధికి రూ.1,000 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఏడాది పొడవునా అన్ని ప్రాంతాల్లో చేపలు లభ్యమయ్యేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఇందుకోసం సమీకృత మత్స్య అభివృద్ధి పథకానికి (ఐఎఫ్‌డీఎస్) రూపకల్పన చేసింది. ఈ పథకం అమలుకు జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్సీడీసీ) రూ.వెయ్యి కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో చేపల ఉత్పత్తిని పెంచడం, ప్రాసెసింగ్, మార్కెటింగ్, అవసరమైన మౌలిక సదుపాయా లను ఏర్పాటు చేస్తారు. ఈ పథకం కింద అన్ని జిల్లాల్లో ఉన్న ప్రాథమిక మత్స్య సహకార సంఘాలు, మహిళా మత్స్య సహకార సంఘాలు, మత్స్య మార్కెటింగ్ సంఘాలు, జిల్లా మత్స్య సహకార సంఘాలు, తెలంగాణ రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్య సభ్యులు లబ్ధిపొందుతారు. రొయ్యలు, చెరువుల్లో, పంజరాల్లో చేపల సాగు వంటి విభిన్న పద్ధతుల ద్వారా చేపల పెంపకం చేపట్టాలని సర్కారు నిర్ణయించింది. సమీకృత మత్స్య అభివృద్ధి పథకం కింద లబ్ధిదారులకు అనేక రకాల పరికరాలు అందజేసేందుకు సర్కారు ఏర్పాట్లు చేసింది. వాటిలో లబ్ధిదారులకు 75 శాతం నుంచి 100 శాతం వరకు రాయితీ లభిస్తుంది. చేపలు అమ్ముకునేందుకు 50 వేల ద్విచక్ర వాహనాలను ప్రభుత్వం అందించనుంది. వాటిని 75 శాతం రాయితీపై ఇవ్వనుంది. -
ఆక్వా రైతులు అప్రమత్తం
= సూపర్‌సైక్లోన్‌గా ‘లెహర్’ = మత్స్యశాఖ అభివృద్ధి అధికారి సురేష్ కైకలూరు, న్యూస్‌లైన్ : తుపాను సమయాల్లో ఆక్వా రైతులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని కైకలూరు మత్స్యశాఖ అభివృద్ధి అధికారి (ల్యాబ్) పీ సురేష్ సూచించారు. వరుస తుపానులు సంభవిస్తున్న నేపథ్యంలో ఆక్వారైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సోమవారం ఆయన న్యూస్‌లైన్‌కు వివరించారు. ఇటీవల కాలంలో నీలం, ఫై-లీన్, హెలెన్ వంటి తుపానులు ఆక్వారైతులను కోలుకోలేని దెబ్బతీయగా, తాజాగా ‘లెహర్’ తుపాను రాకాసి చుట్టుముడుతుందనే వార్తలతో ఆక్వా రైతు అల్లాడిపోతున్నారని చెప్పారు. జిల్లాలో దాదాపు 80 వేల ఎకరాల్లో చేపల చెరువులు, 40 వేల ఎకరాల్లో రొయ్యలసాగు జరుగుతుందన్నారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో వరి రైతులతో పాటు ఆక్వారైతులు విపరీతంగా నష్టపోతున్నారని తెలిపారు. ప్రస్తుతం ముంచుకొస్తున్న లెహర్ సూపర్ సైక్లోన్‌గా మారే అవకాశం ఉందన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆక్వా రైతులు ముందు జాగ్రత్తలు తీసుకుని నష్ట తీవ్రతను తగ్గించుకోవచ్చని చెప్పారు. గట్లను పటిష్ట పర్చడం.... బలహీనంగా ఉన్న గట్లను పటిష్ట పరుచుకోవడమే కాకుండా, ఇసుక బస్తాలను చెరువు వద్ద సిద్ధంగా ఉంచుకోవాలని, గట్ల వెంబడి ఉన్న బలహీనమయిన, ఎండిపోయిన చెట్లను తొలగించుకోవాలని సురేష్ సూచించారు. చెరువులో నీరు నిండుగా ఉన్నట్లుయితే అధిక వర్షం వచ్చినప్పుడు పొర్లిపోకుండా కొంతమేర నీటిని బయటకు పంపేసి మూడు అడుగుల నీరు పట్టెలా ఖాళీగా ఉంచాలన్నారు. చెరువు వద్ద జియోలైట్, సున్నం, హైడ్రోజన్ ఫెరాక్త్సెడ్ మందులు, టార్చిలైటు, డీజిల్ ఆయిల్‌ను నిల్వ చేసుకోవాలని తెలిపారు. చెరువు అడుగు భాగాన తూములను సరిచూసుకోవాలని చెప్పారు. నీటి పరీక్షలు.... చెరువు నీటిలో ఉన్న అమ్మోనియా, నైట్త్రెటు పరీక్షలు చేయించుకొని తగిన మందులు వాడితే ఆక్సిజన్ సమస్య ఉత్పన్నం కాకుండా ఉంటుందని సూచించారు. వర్షం తగ్గిన వెంట నే ఎకరాకు 15 నుంచి 20 కేజీల సున్నం వాడాలని, ఎరువులు, పేడ, కోళ్ల ఎరువు వాడకూడదని చెప్పారు. చెరువుల్లో మేతలు తగ్గించి కట్టుకోవాలని, అసలు వర్షం తగ్గే వరకు మేతలు పూర్తిగా మానివేయడం ఉత్తమమన్నారు. ప్రధానంగా ప్లాంక్టాను, పసరు అధికంగా ఉన్న చెరువుల్లో మేతలు పూర్తిగా మానివేయాలని, ఒకవేళ మేతలు కడితే అందులో విటమిన్ ‘సీ’ కలిపితే మంచిదని చెప్పారు. తడిసిన, బూజుపట్టిన మేతలను ఉపయోగించరాదు. వెనామి రొయ్యల రైతులకు సూచనలు.. తుపాను సమయంలో చెరువుల్లో పిల్ల వేయరాదని మత్స్యశాఖాధికారి సూచించారు. కౌంటుకు వస్తే వెంటనే పట్టుబడి చేయడం ఉత్తమమని తెలిపారు. వర్షం నీటిని చెరువులో పై తూము ద్వారానే బయటకు పంపాలని చెప్పారు.రొయ్యలకు ఒత్తిడి తగ్గించే అయోడిన్, బ్రోమిన్‌ను దగ్గర ఉంచుకోవాలని తెలిపారు. అవసరమైతే మత్య్సశాఖ అధికారుల సూచనలు, సలహాలు తీసుకుని పాటిస్తే కొంతమేర నష్టాలను నివారించవచ్చని చెబుతున్నారు.