తడబడిన టీమిండియా.. 9 వికెట్లు ఫట్!
కాన్సూర్: ప్రతిష్టాత్మక 500వ టెస్టు మ్యాచ్ లో తొలిరోజు టీం ఇండియా తడబడింది. టాప్ ఆర్డర్ రాణించినా మిడిలార్డర్ బ్యాట్స్ మెన్ చేతులెత్తేయడంతో నిర్ణీత 87.1 ఓవర్లలో 291 పరుగులకు తొమ్మిది వికెట్లు కోల్పోయింది. న్యూజిల్యాండ్తో గురువారం ఇక్కడ జరుగుతున్న తొలి టెస్టులో భారత్ భారీ అంచనాలతో బరిలోకి దిగింది. భారత క్రికెట్ చరిత్రలో ఇది 500వ టెస్టు మ్యాచ్ కావడంతో ఎంతో ఆసక్తి రేపిన ఈ టెస్టులో డ్యాషింగ్ బ్యాట్స్ మెన్, కెప్టెన్ విరాట్ కోహ్లి తొమ్మిది పరుగులకే పెవిలియన్ బాట పట్టాడు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న భారత్కు ఓపెనర్లు శుభారంభం ఇవ్వలేకపోయారు. భారత్ స్కోరు 42 పరుగుల వద్ద ఉన్నప్పుడు తొలి వికెట్ గా కేఎల్ రాహుల్(32) వెనుదిరిగాడు. మరో ఓపెనర్ మురళీ విజయ్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.
విజయ్ 123 బంతుల్లో ఆరు ఫోర్ల సాయంతో 65 పరుగులు చేయగా, ఫస్ట్ డౌన్లో వచ్చిన చటేశ్వర పూజారా 84 బంతుల్లో ఎనిమిది ఫోర్లతో 62 పరుగులు చేశారు. వీరిద్దరూ రాణించడంతో ఓ దశలో 46.0 ఓవర్లలో వికెట్ నష్టానికి 147 పరుగులతో దృఢంగా కనించిన టీమిండియా.. విజయ్, పూజారా, కోహ్లి వెంటవెంటనే కోల్పోవడంతో కష్టాల్లో పడింది.
పుజారా, కొహ్లీలు 13 పరుగుల తేడాతో పెవిలియన్ కు చేరడంతో భారీ ఎదురుదెబ్బతగిలింది. అనంతరం బరిలోకి దిగిన రహానే 18, ఆర్జీ శర్మ 35 పరుగులు చేసి వెనుదిరిగారు. స్పిన్నర్ అశ్విన్ 40 పరుగులతో రాణించి సాంట్నెర్ బౌలింగ్ లో టేలర్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ వెంటనే డబ్ల్యూపీ సాహా, మహమ్మద్ షమి లు కూడా డక్ అవుట్ అయ్యారు. తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఉమేశ్ యాదవ్ 8 పరుగులు, రవీంద్ర జడేజా 16 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు. న్యూజిల్యాండ్ బౌలర్లలో బౌల్ట్, సాంట్నెర్ తలో మూడు వికెట్లు పడగొట్టి రాణించారు.