నగదు రహిత వ్యవస్ధ:మోదీ ముందున్న సవాళ్లు
అధిక విలువ కలిగిన నోట్ల రద్దు తర్వాత తన తర్వాతి అడుగును ఏంటనే విషయాన్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత నెల 27వ తేదీన ఉత్తరప్రదేశ్ లోని ఖుషీనగర్ ఎన్నికల ర్యాలీలో బయటపెట్టారు. అదే నగదు రహిత లావాదేవీల ఆర్ధిక వ్యవస్ధ. నగదు రహిత లావాదేవీలపై అవగాహన ఉన్న ప్రతి ఒక్కరూ మిగిలిన వారికి ఆ విషయాన్ని బోధించాలని కోరారు. అదే రోజున జరిగిన మన్ కీ బాత్ కార్యక్రమంలో కూడా డిజిటల్ ఆర్ధిక వ్యవస్ధ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలని సూచించారు.
మీ బ్యాంకు అకౌంట్లు, ఇంటర్ నెట్ బ్యాంకింగ్, బ్యాంకు యాప్ లను ఎలా వినియోగించాలో నేర్చుకోవాలన్నారు. నగదు రహిత వ్యాపారాలను ఎలా నడపాలో, కార్డుల ద్వారా, ఎలక్ట్రానిక్ పేమెంట్స్ ద్వారా ఎలా నగదు లావాదేవీలో జరపాలో తెలుసుకోవాలని కోరారు. షాపింగ్ మాల్స్ లో ఆ ప్రక్రియ ఎలా జరుగుతుందో నిశితంగా గమనించాలని సూచించారు. మోదీ కేబినేట్ మంత్రులు కూడా నగదు రహిత లావాదేవీలపై విస్తృత అవగాహన ఏర్పరించేందుకు ప్రయత్నిస్తుండటం భారతదేశాన్ని నగదు రహిత ఆర్ధిక వ్యవస్ధగా తీర్చిదిద్దటానికి మోదీ నడుబిగించినట్లు అర్ధమవుతుంది.
అంతర్జాల వినియోగంలో భారతీయులు అమెరికాను దాటేసినా.. స్మార్ట్ ఫోన్ల ద్వారా ఇంటర్నెట్ ను వినియోగించే సామర్ధ్యం చాలా తక్కువ మందికే తెలుసు. దీంతో డెబిట్, క్రెడిట్ కార్డులు, కార్డు స్వైప్ మిషన్లు, డిజిటల్ వాలెట్ల వినియోగం లాంటి వాటిపై సగటు దేశపౌరుడికి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. దేశంలో 68శాతం లావాదేవీలు నగదు రూపంలోనే జరుగుతున్నాయని బిజినెస్ స్టాండర్డ్ చేసిన ఓ సర్వేలో తేలింది. కాగా, మిగిలిన సర్వేలన్నీ 90 శాతం లావాదేవీలు నగదు రూపంలో జరుగుతున్నాయని చెప్పాయి.
ఇన్ని ప్రతికూలతల నడుమ మోదీ కలలుగంటున్న నగదు రహిత ఆర్ధిక వ్యవస్ధ సాధ్యం అవుతుందా?. భారత ఆర్ధిక వ్యవస్ధను నగదు రహితంగా మార్చడానికి ఆయన పెనుసవాళ్లును ఓ సారి చూద్దాం.
మోదీ ముందున్న ఐదు సవాళ్లు:
1. ఈ ఏడాది తొలి అర్ధభాగంలో ఇంటర్నెట్ వినియోగంలో భారత్ అమెరికాను దాటేసినట్లు టెలికాం రెగ్యులేటరి అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) పేర్కొంది. ప్రపంచం మొత్తంలో 342మిలియన్ల అంతర్జాల వినియోగదారుల్లో 27శాతం మంది భారతీయులే ఉన్నారని చెప్పింది. అయితే, కేవలం అతికొద్ది మంది దేశజనాభా మాత్రమే ఇంటర్నెట్ వినియోగిస్తుండటం మోదీ ఆలోచనకు ఎదురొచ్చే తొలి అడ్డంకి.
భారత పట్టణాల్లో కూడా 58శాతం మందే ఇంటర్నెట్ ను వినియోగిస్తున్నారు. దేశ జనాభాలో 73 శాతం మందికి ఇంటర్నెట్ సదుపాయం లేదు. ఈ విషయంలో నైజీరియా, కెన్యా, ఘనా, ఇండోనేసియా దేశాలు భారత్ కంటే ముందున్నాయి.
2. స్మార్ట్ ఫోన్: మోదీ కలలుగంటున్న డిజిటల్ బ్యాంకింగ్ విజయం సాధించాలంటే స్మార్ట్ ఫోన్ల వినియోగం గణనీయంగా పెరగాలి. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో స్మార్ట్ ఫోన్ల వినియోగం అంచెలంచెలుగా ఎదుగుతున్నా.. భారత్ లో సగటున కేవలం 17 శాతం మంది యువత మాత్రమే స్మార్ట్ ఫోన్లను వినియోగిస్తున్నారని ప్యూ అనే పరిశోధనా సంస్ధ చేసిన సర్వేలో వెల్లడైంది.
తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాల్లో కేవలం 7 శాతం మంది యువత మాత్రమే స్మార్ట్ ఫోన్లను వినియోగిస్తుండగా, 22 శాతం మంది సంపన్న కుటుంబాలకు చెందిన యువత స్మార్ట్ ఫోన్లను వాడుతున్నారు.
3. దేశంలో 1.02 బిలియన్ల వైర్ లెస్ ఇంటర్నెట్ వినియోగదారులు, కేవలం 15శాతం(154మిలియన్లు) బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్లు ఉన్నట్లు 2016లో ట్రాయ్ ఓ రిపోర్టులో పేర్కొంది.
4. వేగవంతమైన ఇంటర్నెట్ సదుపాయంలో కూడా భారత్ వెనకంజలో ఉంది. సగటున ఓ మొబైల్ ఫోన్ పేజీ లోడ్ కావడానికి భారత్ లో 5.5సెకన్ల సమయం పడుతోంది. ఇదే చైనాలో 2.6 సెకన్లు, శ్రీలంకలో 4.5 సెకన్లు, బంగ్లాదేశ్ లో 4.9 సెకన్లు, పాకిస్తాన్ లో 5.8 సెకన్లుగా ఉందని గ్లోబల్ కంటెంట్ డెలివరీ నెట్ వర్క్ సర్వీసెస్ ప్రొవైడర్ పేర్కొంది.
ప్రపంచంలో అత్యంత వేగవంతమైన పేజ్ లోడ్ ఇజ్రాయెల్ లో ఉంది. అక్కడి ఇంటర్నెట్ వినియోగదారుడికి ఒక పేజి 1.3సెకన్లలో లోడ్ అవుతోంది. మొబైళ్లలో ఇంటర్నెట్ పేజీలు వేగంగా లోడ్ కాకపోతే ఆన్ లైన్ లావాదేవీలు జరపడం కష్టతరమౌతుంది. ఇప్పటికే దేశంలో 68శాతం మంది ఇంటర్నెట్ వేగంపై పెదవి విరుస్తున్నారు.
5. పది లక్షల మంది పౌరులకు కేవలం 856 పీఎస్ వో(కార్డు స్వైపింగ్) మిషన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది ఆగష్టుకు 14లక్షల 60వేల పీఎస్ వో మిషన్లు దేశం మొత్తం మీద ఉన్నట్లు ఆర్బీఐ తెలిపింది. భారత జనాభా కంటే 84శాతం తక్కువ జనాభా కలిగిన బ్రెజిల్ తన జనాభాకు 39రెట్లు పీఎస్ వో మిషన్లు ఉన్నట్లు 2015లో చెప్పింది. అదే రష్యా, చైనాల్లో ప్రతి పదిలక్షల మంది పౌరులకు 4వేల పీఎస్ వో మిషన్లు ఉన్నాయి.
భారత్ లో అందుబాటులో ఉన్న 70శాతం పీఎస్ వో మిషన్లు కూడా 15 పెద్ద నగరాలకే పరిమితం అయ్యాయి. నోట్ల రద్దు వల్ల ఈ నగరాల్లో పెద్దగా ఇబ్బందులు కూడా కనిపించలేదు. మెట్రో నగరాలకే కాకుండా పట్టణాలు, గ్రామాలకు కూడా పీఎస్ వోలను విస్తరించగలిగితేనే మోదీ కల సాధ్యమవుతుంది. ఇప్పటికే పీఎస్ వోల తయారీల కంపెనీలపై భారత ప్రభుత్వం 12 శాతం ఎక్సైజ్ సుంకాన్ని, 4 శాతం ప్రత్యేక ఎక్సైజ్ పన్నును రద్దు చేసింది. వచ్చే ఏడాది మార్చి కల్ల 10 లక్షల కొత్త పీఎస్ వో లు అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం ఆశిస్తోంది.