లక్కు.. కిక్కు..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ఈ ఏడాది కూడా లక్కున్నోళ్లకే కిక్కెక్కించే మద్యం దుకాణాలు దక్కనున్నాయి. లాటరీ పద్ధతినే దుకాణాలను కేటాయించనున్నారు. 2014-15 సంవత్సరానికి గాను ఫిక్స్డ్ లెసైన్స్డ్ పద్ధతిపై మద్యం షాపులు కేటాయించేందుకు ఎక్సైజ్ అధికారులు సోమవా రం నోటిఫికేషన్ విడుదల చేశారు.
జిల్లాలో మొత్తం 142 మద్యం దుకాణాలకు గానూ గత ఏడాది కేటాయించిన 130 దుకాణాలకు ఈ నెల 21వరకు దరఖాస్తులు చేసుకోవచ్చ ని చెప్పారు. జిల్లాలోని నిజామాబాద్, కా మారెడ్డి ఎక్సైజ్ సూపరింటెండెంట్ల(ఈఎస్) కార్యాలయాల పరిధిలోని ఈ దుకాణాలను 23న ఉదయం 11గంటల నుంచి లాటరీ పద్ధతిన కేటాయించనున్నారు. 2014-15 ఎకై ్సజ్ పాలసీని ప్రభుత్వం శనివారం ప్రకటించింది. ఈమేరకు ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాల ప్రకారం జిల్లా అధికారులు ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు.
జనాభా ప్రాతిపదికన ఆరు స్లాబుల్లో ఫిక్స్డ్ లెసైన్స్డ్ పద్ధతిని అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీని ప్రకారం..
1. పదివేల వరకు జనాభా ఉండే ప్రాంతంలో ఒక్కో దుకాణానికి రూ.32.50 లక్షలు లెసైన్స్ ఫీజు చెల్లించాలి.
2. పదివేల నుంచి యాభైవేలలోపు జనాభా ప్రాంతానికి రూ.34లక్షలు
3. యాభైవేల నుంచి మూడు లక్షల జనాభా వరకు రూ.42లక్షలు
4. మూడు లక్షల నుంచి ఐదులక్షల లోపు జనాభా ఉంటే రూ.50 లక్షలు
5. ఐదు లక్షల నుంచి ఇరవై లక్షల లోపు జనాభా ఉంటే రూ.68 లక్షలు
6. ఇరవై లక్షలు ఆపైన జనాభా ఉండే ప్రాంతాల్లో ఒక్కో దుకాణానికి రూ.90 లక్షలు లెసైన్స్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
ఈ నేపథ్యంలో జిల్లాల్లో నాలుగు స్లాబుల్లోనే మద్యం దుకాణాలు కేటాయించే అవకాశం ఉంది. అత్యధికంగా మూడులక్షల నుంచి ఐదులక్షల లోపు జనాభా ఉన్న నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలోని 22 దుకాణాల ద్వారా సర్కారుకు లాభం చేకూరనుంది. ఒక్కో దుకాణానికి రూ.50 లక్షల చొప్పున లెసైన్స్ ఫీజు సర్కారు ఖజానాకు చేరనుంది. యాభైవేల నుంచి మూడులక్షల లోపు జనాభా కలిగిన బోధన్, కామారెడ్డిలలో 12 దుకాణాలకు రూ.42 లక్షల చొప్పున రూ.5.04 కోట్ల ఆదాయం ఫీజు రూపేణా రానుంది. అలాగే పదివేల నుంచి యాభైవేల లోపు జనాభా ఉన్న 40 దుకాణాలకు రూ.34 లక్షల చొప్పున రూ.13.60 కోట్లు, పదివేల జనాభా ఉన్న 56 దుకాణాలపై రూ.32.50 లక్షల చొప్పున రూ.18.20 కోట్లు లెసైన్స్ ఫీజు రానుంది.
లాటరీ ద్వారానే కేటాయింపు
ఈ ఏడాది కూడా మద్యం దుకాణాల ఎంపికను లాటరీ పద్ధతి ద్వారానే కేటాయించనుండటంతో ఎక్సైజ్ కొత్త పాలసీలో అధిక లాభాలు చూపే షాపులు ఎవరికీ దక్కుతాయోననే చర్చ ఇప్పటి నుంచే సాగుతోంది. గత ఏడాది జూన్ 27న టెండర్లు నిర్వహించిన అధికారులు లాటరీ ద్వారానే దుకాణాలను కేటాయించారు. ఈ ఏడాది నిజామాబాద్ ఈఎస్ పరిధిలోని 93, కామారెడ్డి యూనిట్ కింద ఉన్న 37 దుకాణాలను పొందాలనుకునే వారు ఈనెల 21న సాయంత్రం 5 గంటల్లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది.
దరఖాస్తులను పరిశీలించిన తర్వాత ఈనెల 23న జిల్లాకేంద్రంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో ఉదయం 11 గంటల నుంచి లాటరీ ద్వారా దుకాణాలను కేటాయించనున్నారు. ఈ నెలాఖరులోగా లెసైన్స్‌లు మంజూరు చేస్తారు. జులై 1 నుంచి దుకాణాలు పొందిన యజమానులు మద్యం విక్రయించుకోవచ్చని అధికారులు తెలిపారు.మద్యం టెండర్లకు పకడ్బందీగా ఏర్పాట్లు -ఎ. అరుణ్‌రావు, ప్రొహిబిషన్, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్
సుభాష్‌నగర్ : జిల్లాలో 2014-15 సంవత్సరానికి గాను 130 దుకాణాలకు లాటరీ ద్వారా కేటాయించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ప్రొహిబిషన్, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఎ.అరుణ్‌రావు తెలిపారు. మద్యం దుకాణాల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాల మేరకు నోటిఫికేషన్ విడుదల చేశామన్నారు. జిల్లాకేంద్రంలోని ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
మొత్తం 142మద్యం దుకాణాలకు గానూ గత ఏడాది పిలిచిన 130దుకాణాలకే ఈసారి కూడా టెండర్లు పిలుస్తున్నట్లు చెప్పారు. ఆసక్తి గల వ్యాపారులు దరఖాస్తు చేసుకొని లాటరీ ద్వారా దుకాణాలు పొందవచ్చన్నారు. ఒక్కొక్కరు దుకాణానికి ఒకే దరఖాస్తు చేసుకోవచ్చని, దరఖాస్తులను దాఖలు చేసేందుకు జిల్లాకేంద్రంలోని ఈఎస్ కార్యాలయంతో పాటు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బాక్సులను ఏర్పాటు చేశామన్నారు.మద్యం దుకాణాలను పొందిన వారు రూ.2లక్షలు చెల్లించి పర్మిట్రూం లెసైన్స్‌లు పొందాల్సి ఉంటుందన్నారు. సమావేశంలో నిజామాబాద్, కామారెడ్డిల ఎక్సైజ్ సూపరింటెండెంట్లు ఎం.గంగారాం, కె.చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.