అప్పుడప్పుడు అలా వెళ్లొస్తుండండి మేడమ్!
పరిశోధన
ఎప్పుడూ ఇంట్లో ఉంటే ఏమౌతుంది? బోర్ కొడుతుంది. ఎందుక్కొడుతుంది! టీవీల్లేవేంటి? వాటిల్లో బ్రేకింగ్న్యూసుల్లేవేంటి? ఉంటాయి సరే... వాటితో పాటు ఇంట్లో దుమ్ము, ధూళి, కెమికల్స్ కూడా ఉంటాయి. అవి డేంజర్. న్యూసులు, బ్రేకింగ్ న్యూసులు ఏమీ ఇవ్వకుండానే అవి ఇంట్లోని వాళ్లందర్నీ... చావగొట్టి చెవులు మూస్తాయి. ఇంట్లో వాళ్లందర్నీ అంటే... కదలకుండా ఇంట్లో కూర్చునేవాళ్లందర్నీ అని. ఈ సంగతిని స్వీడన్ శాస్త్రవేత్తలు కనిపెట్టారు. వాళ్లకైనా ఎలా తెలిసిందంటే... బట్టలు, ఫర్నీచరు, ఎలక్ట్రానిక్ పరికరాలతో కీకారణ్యంలా ఉండే ఇళ్లలోని పిల్లులు త్వరత్వరగా టపా కట్టేస్తున్నాయట!
ఈ వస్తువుల పైపూతలకు (బ్రామినేటెడ్ ఫ్లేమ్ రిటార్డెంట్స్) అస్తమానం దగ్గరగా ఉండడం వల్ల పిల్లుల ఆరోగ్యం క్షీణించి అవి అవసానదశకు చేరుకుంటున్నాయట. ఈ సూత్రాన్ని మనుషులకూ అప్లై చేసి, కాస్త అప్పుడప్పుడూ ఇల్లొదిలి వెళ్లండి అమ్మలాలా అని సలహా ఇస్తున్నారు. అబ్బే.. సలహా ఇలాక్కాదు ఇవ్వాల్సింది. ‘అప్పుడప్పుడూ బయటికి తీసుకెళ్లండి అయ్యలాలా’ అని చెప్పాలి.
ఓకే డన్