రిఫ్లెక్స్.. తొలి ఫ్లెక్సిబుల్ స్మార్ట్‌ఫోన్
టొరెంటొ: ప్రపంచపు తొలి ఫ్లెక్సిబుల్ స్మార్ట్‌ఫోన్ ‘రిఫ్లెక్స్’ సిద్ధమయింది. కెనడాలోని క్వీన్ యూనివర్సిటీ హ్యూమన్ మీడియా ల్యాబ్ పరిశోధకులు ఈ స్మార్ట్‌ఫోన్‌ను అభివృద్ధి చేశారు. దీన్ని బెండ్ సెన్సార్స్ సాయంతో రూపొందించారు. వీటి వల్ల చేతితో స్క్రీన్‌ను తాకకుండానే పేజ్‌లను తిరిగేయవచ్చు. అలాగే గేమ్స్ ఆడుకోవచ్చు. ‘రిఫ్లెక్స్’ స్మార్ట్‌ఫోన్‌ను కుడివైపు కిందకు వంచితే.. పుస్తకంలో మాదిరిగానే పేజీలు చేతివేళ్ల ద్వారా కుడి నుంచి ఎడమ వైపునకు వెళ్తాయని హ్యూమన్ మీడియా ల్యాబ్ డెరైక్టర్ రోయెల్ వెర్టిగల్ తెలిపారు. పేజ్‌లు ఒకవైపు నుంచి మరోవైపునకు వెళ్లేటప్పుడు వైబ్రేషన్ వస్తుందని, తద్వారా పేజ్‌లు మారే అనుభూతిని పొందొచ్చని పేర్కొన్నారు. ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఓఎస్‌పై పనిచేసే ‘రిఫ్లెక్స్’ స్మార్ట్‌ఫోన్‌లో హై డెఫినేషన్ ఎల్జీ డిస్ప్లే ఫ్లెక్సిబుల్ ఓఎల్ఈడీ టచ్ స్క్రీన్‌ను పొందుపరిచినట్లు తెలిపారు.