ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ముప్పు
నెవార్క్(అమెరికా): ఎయిర్ ఇండియా విమానానికి అమెరికాలో ప్రమాదం తప్పింది. ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే పక్షి ఢీకొనడంతో విమానం ఎడమ ఇంజిన్ పాడైంది. దీంతో విమానాన్ని వెనక్కు తీసుకొచ్చి సురక్షితంగా కిందకు దించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
313 మంది ప్రయాణికులతో న్యూజెర్సీలోని నెవార్క్ లిబర్టీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆదివారం సాయంత్రం 4.30 గంటల ప్రాంతం(స్థానిక సమయం) బయలుదేరిన ముంబై విమానం ఏఐ-114ను పక్షి ఢీకొట్టడంతో ఎడమ ఇంజిన్ పాడైందని ఎయిర్ ఇండియా అధికారి ఒకరు తెలిపారు. దీంతో అరగంట తర్వాత విమానాన్ని వెనక్కు తీసుకొచ్చినట్టు చెప్పారు. విమానంలోని వారందరూ సురక్షితంగా ఉన్నారని తెలిపారు. ఇంజిన్ లో తలెత్తిన లోపాన్ని సరిచేసేందుకు ఢిల్లీ నుంచి నిపుణులు వస్తున్నారని వెల్లడించారు. ప్రయాణికులను పంపించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు.