పక్కకు పడిపోయిన ఐఎన్ఎస్ బెత్వా
ముంబై: దేశీయ సాంకేతికతో తయారు చేసిన యుద్ధనౌక ఐఎన్ఎస్ బెత్వా సోమవారం ప్రమాదానికి గురైంది. ముంబైలోని డాక్ యార్డు నుంచి బయల్దేరుతున్న బెత్వా ఒక్కసారిగా పక్కకు పడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు నేవీ సైలర్లు మరణించగా, 14 మందికి చిన్నపాటి గాయాలయ్యాయి. ఐఎన్ఎస్ బెత్వా పక్కకు పడిపోవడంపై స్పందించిన నేవీ.. మునుపెన్నడూ ఇలాంటి సంఘటన ఎదురుకాలేదని, ఇది చాలా బాధాకరమైన విషయమని పేర్కొంది.
చిన్నపాటి రిపేర్లు ఉండటంతో షిప్ ను డాక్ యార్డుకు తీసుకువచ్చినట్లు చెప్పింది. సోమవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో డాక్ యార్డు నుంచి నౌకను తిరిగి నీటిలోకి తీసుకువెళ్తుండగా అదుపుతప్పి ఓ వైపుకు పడిపోయినట్లు తెలిపింది. ఈ దురదృష్టకర సంఘటనలో 3,850 టన్నుల బరువున్న బెత్వా మెయిన్ మాస్ట్ పగిలిపోయినట్లు వెల్లడించింది.
మరణించిన సైలర్లలో ఒకరు నీటిలో పడిపోగా.. మరొకరు నౌక లోపలి భాగంలో ఉన్నట్లు చెప్పింది. డాక్ బ్లాక్స్ మెకానిజం ఫెయిల్ అవడం వల్లే ఈ దుర్ఘటన జరిగినట్లు అనుమానిస్తున్నామని నేవీ అధికార ప్రతినిధి కెప్టెన్ డీకే శర్మ తెలిపారు. 2004లో నేవీలో చేరిన బెత్వా.. బ్రహ్మోస్ క్షిపణులతో పాటు, యాంటీ షిప్ మిస్సైల్స్ ను ప్రయోగించగలదు.