ఫ్లవర్ కార్పెట్
మనిషన్నాక కూసింత కళాపోషణ ఉండాలట! ‘ముత్యాలముగ్గు’ సినిమాలో రావుగోపాలరావు ఫేమస్ డైలాగిది. ఫొటో చూస్తే నిజమే సుమా అనిపించక మానదు. వావ్... ఎంత అందంగా ఉందీ అనకుండా ఉండలేము. బెల్జియం రాజధాని బ్రస్సెల్స్లో ఇటీవల ఈ భారీ పూల తివాచీని అమర్చారు. బెల్జియం, జపాన్ దేశాల 150 ఏళ్ల స్నేహానికి గుర్తుగా బ్రస్సెల్స్లోని గ్రాండ్ ప్లేస్లో వెయ్యి చదరపు మీటర్ల విస్తీర్ణంలో దీన్ని ఏర్పాటు చేశారు .
‘టాపిస్ డీ ఫ్లూర్స్’ అనే స్వచ్ఛంద సంస్థ డిజైన్ చేయగా గ్రాఫిక్ డిజైనర్లు, ఆర్కిటెక్ట్లు, ఇల్లస్ట్రేటర్లు, కార్యకర్తలు కలసి సిద్ధం చేశారు. వేర్వేరు రంగుల్లో ఉండే దాదాపు 6,00,000 పూల గుత్తులతో ఏర్పాటు చేసిన ఈ పూల తివాచీపై పక్షులు, పూలు, చెట్లు, మొక్కల ఆకారాలు ఉన్నాయి. డిజైనింగ్ ప్రక్రియ మొత్తం పూర్తయిన తరువాత 120 మంది కార్యకర్తలు కేవలం నాలుగు గంటల్లో దీన్ని సిద్ధం చేయడం విశేషం. దాదాపు 77 మీటర్ల పొడవు, 24 మీటర్ల వెడల్పు ఉన్న ఈ తివాచీలో రుతువుల గమనాన్ని సూచించే విధంగా పూల ఆకారాలు ఉన్నాయి. 1971 నుంచి రెండేళ్లకు ఒకసారి ఇలాంటి పూల తివాచీని ఏర్పాటు చేస్తున్నారు బెల్జియం వాసులు. పూలు వాడిపోయేంత వరకూ కొన్నిరోజులపాటు ఈ ప్రాంతంలోనే సంగీత కచేరీలు, లైట్షోలు కూడా ఏర్పాటు చేస్తారు. ఈ ఏడాదికి ఈ అద్భుత దృశ్యాన్ని చూసే అవకాశమెలాగూ లేదుకాబట్టి.. 2018 నాటికైనా బ్రస్సెల్స్ సందర్శించేలా ప్లాన్ చేసుకోండి మరి!