మూడు నగరాలు.. ఆరు గ్రామాలు
సాక్షి, హైదరాబాద్: దేశంలోని ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు, గ్రామీణ ప్రాంతాలపై ఈ–కామర్స్ దిగ్గజ సంస్థలు దృష్టి సారించాయి. ప్రస్తుత పండుగల సీజన్లో ఆయా ప్రాంతాల్లో ఆన్లైన్ షాపింగ్‌కు డిమాండ్ పెరగడంతో.. అటువైపు ఈ సంస్థలు దృష్టికేంద్రీకరిస్తున్నాయి. ప్రధాన నగరాలు, పట్టణాలకు దూరంగా ఉండే ప్రదేశాల్లో వాణిజ్య, వ్యాపార కార్యకలాపాల విస్తరణ సవాళ్లతో కూడుకున్నది.అందుకు అనుగుణంగా తమ వ్యూహాల్లో మార్పులు, చేర్పులకు ఈ సంస్థలు మొగ్గుచూపుతున్నాయి. ఆయా ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు అంతబాగా లేకపోవడం, వాతావరణంలో మార్పులు, విస్తీర్ణం ఎక్కువగా ఉండడం తదితర సమస్యలు ఎదురవుతున్నాయి. కానీ ఈ ప్రాంతాల్లో పెరుగుతున్న డిమాండ్‌కు తగ్గట్టుగా మౌలిక సదుపాయాలు, టెక్నాలజీ, ఇతర సౌకర్యాల పెంపునకు ఈ సంస్థలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి.ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, మీషో తదితర ఈ –కామర్స్ దిగ్గజ సంస్థలు తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్ ఇటీవల ‘ద బిగ్ బిలియన్ డేస్’ సేల్ నిర్వహించింది. ఈ సందర్భంగా 2,800 చిన్న పట్టణాలు, కమలాపురం, వాడర్, సిహోర్, బన్సాతర్ ఖేడా, వెరంగ్టే, భోటా (టయర్–4 సిటీస్ తో సహా) వంటి ప్రాంతాల్లో వాల్యూ–కామర్స్ ప్లాట్‌ఫామ్ షాప్ అమ్మకాల్లో మంచి పురోగతి కనబరిచింది. ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ డిమాండ్ అంతకంతకు పెరుగుతున్నట్టుగా ఈ –కామర్స్ విక్రయాల పెరుగుదలను బట్టి అవగతమౌతోంది.గ్రామీణ ప్రాంతాల నుంచే ఎలక్ట్రాన్రిక్స్, ఫ్యాషన్, మొబైల్, హోం, సౌందర్య సాధనాలకు అధిక డిమాండ్ పెరుగుతున్నట్లుగా ఆయా సంస్థలు గుర్తించాయి. మొత్తం సెల్‌ఫోన్ అమ్మకాల్లో 75 శాతానికి పైగా చిన్న పట్టణాల నుంచి ఉండడంతో.. అక్కడే ఈ సంస్థలు అధికంగా దృష్టి పెడుతున్నాయి. ఇదే సమయంలో.. చిన్నపట్టణాలు, నగరాల్లో ఈ–కామర్స్ సర్వీసులు అంతకంతకు పెరుగుతున్న క్రమంలో.. స్థానికంగా ఉన్న వివిధ రంగాలకు చెందిన వారికి ఉపాధి అవకాశాలు కూడా పెరగడం కలిసొచ్చే అంశంగా పరిగణిస్తున్నారు.ప్రస్తుతం పండుగల సీజన్లో.. ఫ్లిప్‌కార్ట్ సంస్థ తొమ్మిది నగరాల్లో 11 నూతన ఫుల్ఫిల్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయడం ద్వారా.. 40 ప్రాంతాల్లో లక్ష మందికి పైగా ఉపాధి అవకాశాల కల్పన జరిగినట్టుగా అంచనా వేస్తున్నారు. ఈ ఫుల్ఫిల్మెంట్ సెంటర్లు స్థానికంగా ఉంటున్న వివిధ వర్గాల ఆర్థిక పురోగతికి దోహదపడుతున్నాయి. ఇవి ప్రధానంగా రవాణా, ప్యాకేజింగ్, రిటైల్ రంగాల్లో వృద్ధికి ఇతోధిక సహాయాన్ని అందిస్తున్నాయి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్–2024లో భాగంగా (సెపె్టంబర్ 27న మొదలై నెలపాటు సాగింది) ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నుంచి డిమాండ్ గణనీయంగా పెరిగినట్టుగా వెల్లడైంది. అమెజాన్ ద్వారా ‘నో–కాస్ట్ ఈఎంఐ’ లావాదేవీలు 40 శాతానికి పైగా పెరిగినట్టు స్పష్టమైంది.మొబైల్స్, వాషింగ్ మెషీన్లు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, వీడియో గేమ్‌ల వంటి వాటికి మంచి డిమాండ్ ఏర్పడినట్టుగా తేలింది. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల నుంచే 75వ శాతానికి పైగా స్మార్ట్ఫోన్ల అమ్మకాలు జరిగినట్టు వెల్లడైంది. అందులోనూ అన్ని ప్రీమియం స్మార్ట్ఫోన్ల విక్రయాలు 70 శాతం (రూ.30 వేలకు పైగా) జరిగాయి. చిన్ననగరాలు, పట్టణాల నుంచి 80 శాతం టీవీ కొనుగోలు ఆర్డర్లు వచి్చనట్టు తెలుస్తోంది.అమెజాన్ తన రెండువేల డెలివరీ స్టేషన్ల ద్వారా మారుమూల ప్రాంతాలను చేరుకునేందుకు ఏర్పాట్లు చేసింది. సముద్రమట్టానికి 1,372 మీటర్ల ఎగువనున్న ఉత్తరాఖండ్ గజోలిలోని మహరిషీ ఆశ్రమానికి నిత్యావసర వస్తువులు సరఫరా చేసిన మొట్టమొదటి ఈ–కామర్స్ ప్లాట్‌ఫామ్‌గా అమెజాన్ రికార్డ్‌ను నెలకొల్పడం విశేషం. ఈ సంస్థ తన వస్తు సరఫరాను అండమాన్ నికోబార్ దీవులకు కూడా విస్తరించింది. భారత రైల్వేలు, ఇండియా పోస్ట్‌ల భాగస్వామ్యంతో అమెజాన్ ఎయిర్ సరీ్వస్‌ను కూడా నిర్వహిస్తోంది. మరోవైపు మీషో సంస్థ కూడా తన మెగా బ్లాక్‌బస్టర్ సేల్‌తో గ్రామీణ ప్రాంతాల్లోకి చొచ్చుకెళ్లింది.