అంత్య పుష్కరాలకు రూ.43 లక్షలు
కొవ్వూరు/నరసాపురం : అంత్య పుష్కరాలకు అవసరమైన తాత్కాలిక ఏర్పాట్లపై కొవ్వూరు, నరసాపురం మునిసిపాలిటీలు ఎట్టకేలకు దృష్టి సారించాయి. ఈనెల 31వ తేదీ నుంచి 12 రోజులపాటు నిర్వహించే అంత్య పుష్కరాలకు కొవ్వూరు మునిసిపాలిటీ రూ.44 లక్షలు కేటాయించాలని నిర్ణయించింది. ‘పుష్కరాలు వచ్చేస్తున్నాయ్.. ఏర్పాట్లపై దృష్టి సారించని సర్కార్’ శీర్షికన జూన్ 23వ తేదీన ‘సాక్షి’లో ప్రచురించిన కథనంపై మునిసిపల్ పాలకవర్గాలు స్పందించాయి. కొవ్వూరు మునిసిపల్ చైర్మన్ సూరపనేని సూర్యభాస్కర రామ్మోహన్ (చిన్ని), కమిషనర్ టి.నాగేంద్రకుమార్ ఇటీవల అధికారులతో సమావేశం నిర్వహించి అంత్య పుష్కరాలకు వచ్చే భక్తులకు కల్పించాల్సిన ఏర్పాట్లపై సమీక్షించారు.
గతనెల 28న నిర్వహించిన సాధారణ సమావేశంలో రూ.43 లక్షలు నిధులు కేటాయిస్తూ తీర్మానం చేశారు. ప్రధానంగా తాగునీటి సౌకర్యానికి రూ.2 లక్షలు, తాత్కాలిక మరుగుదొడ్లు, కరెంటు చార్జీల నిమిత్తం రూ.3 లక్షలు, దుస్తులు మార్చుకునే తాత్కాలిక గదుల నిర్మాణానికి రూ.3 లక్షలు, తాత్కాలిక మరుగుదొడ్ల ఏర్పాటుకు రూ.5 లక్షల చొప్పున నిధులు కేటాయిస్తూ తీర్మానం చేశారు.
కన్జర్వెన్సీ సామగ్రి కొనుగోలుకు రూ.12 లక్షలు, 250మంది తాత్కాలిక పారిశుధ్య సిబ్బందిని వినియోగించేందుకు రూ.13 లక్షలు, పారిశుధ్య పనుల నిర్వహణకు జేసీబీ, ట్రాక్టర్లను అద్దె ప్రతిపాదికన తీసుకునేందుకు రూ.5 లక్షలు కేటాయిస్తూ తీర్మానం చేశారు. అంత్య పుష్కరాలకు ప్రత్యేక నిధులు కేటాయిస్తే ఆ నిధుల నుంచి ఖర్చు చేయాలని, లేదంటే పురపాలక సంఘ సాధారణ నిధుల నుంచి వెచ్చించాలని నిర్ణయించారు.
పట్టణంలోని ప్రధాన డ్రెయిన్లలో సిల్ట్‌ను తొలగించేందుకు చర్యలు చేపట్టాలని కౌన్సిల్ నిర్ణయించింది. మరోవైపు అంత్య పుష్కరాలకు సంబంధించిన ఏర్పాట్లపై నరసాపురం మునిసిపాలిటీ దృష్టి సారించింది. మునిసిపల్ చైర్పర్సన్ పసుపులేటి రత్నమాల అధికారులు, కౌన్సిలర్లతో గురువారం సమావేశమయ్యారు. ఘాట్లలో చేయాల్సిన తాత్కాలిక ఏర్పా ట్లు, చేపట్టాల్సిన పనులపై చర్చించారు. లైటింగ్, మంచినీటి సదుపాయం, ఇతర పనుల నిమిత్తం ఏ మేరకు నిధులు అవసరమవుతాయనే అంశాలపై ప్రతిపాదనలు రూపొందించాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచనలిచ్చారు.