బెల్టు సైజులో కృత్రిమ కిడ్నీలు!
మూత్రపిండాల సమస్యలతో బాధపడేవారికి స్వాంతన కలిగించి, ఆశలు పెంచే పరిణామమిది. డయాలసిస్ కేంద్రాలకు వెళ్లే అవసరం లేకుండా ఎంచక్కా రోజువారీ పనులు చక్కబెట్టుకుంటూనే రక్తంలోని మలినాలను శుద్ధి చేసేందుకు పనికొచ్చే వేరబుల్ కత్రిమ కిడ్నీ పరీక్షలకు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనుమతులిచ్చింది. కేవలం 4.5 కిలోల బరువుతో ఉండే ఈ పరికరాన్ని బెల్టు మాదిరిగా నడుముకు చుట్టేసుకోవచ్చు. 0.5 లీటర్ల నీరు, ఇతర రసాయనాల సాయంతో ఎప్పటికప్పుడు రక్తాన్ని శుద్ధి చేస్తుంది. డయాలసిస్ కేంద్రాల్లో గంటలపాటు గడపాల్సిన పని తప్పిపోతుంది. సెడార్స్ సినాయ్ మెడికల్ సెంటర్ శాస్త్రవేత్త విక్టర్ గురా తదితరులు దశాబ్ద కాలం పరిశోధనల ఫలితంగా తయారైన ఈ పరికరాన్ని బ్రిటన్, ఇటలీల్లో 32 మందిపై పరీక్షించారు. అమెరికాలోనూ కొంతమందిపై రెండు దశల్లో పరీక్షలు జరిపిన తరువాత అందరికీ అందుబాటులోకి రానున్నాయి ఈ కృత్రిమ కిడ్నీలు!
ఎన్గోతో... వైఫై, వైర్లెస్ ఛార్జింగ్
బ్యాటరీ ఛార్జ్ అయిపోతూంటే చాలు... మనకు కంగారు పెరిగిపోతూంటుంది. ఎక్కడా ఛార్జింగ్ పాయింట్ దొరుకుతుందా అని వెతికేస్తూంటాం. అమెరికాలోని సెయింట్ లూయీ విశ్వవిద్యాలయ విద్యార్థులు, సిబ్బందికి ఇకపై ఈ ఇబ్బంది అస్సలుండదు. ఫొటోలో కనిపిస్తోంది చూడండి... అలాంటి ఎన్గో ఛార్జింగ్ స్టేషన్లు అక్కడ ఏర్పాటు చేశారు మరి. సౌరశక్తి ఫలకాలతో పుట్టే విద్యుత్తును వాడుకుని మొబైల్ ఫోన్లను ఛార్జ్ చేసుకోవడం, వైఫై సదుపాయం అందుకోవడం మాత్రమే దీని ప్రత్యేకత కాదు. ఈ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన కొన్ని ప్రత్యేకమైన టైల్స్ (పచ్చగా కనిపిస్తున్నాయే... అవే) పై నడిచినా చాలు. కొంత కరెంటు ఉత్పత్తి అవుతుంది. ఎన్గో స్టేషన్లో 12 ఛార్జర్లు, రెండు యూఎస్బీ పోర్టులతోపాటు రెండు వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్స్ కూడా ఉంటాయి. బస్టాండుల్లో, నగరాల్లోని బస్టాపుల్లోనూ ఇలాంటివి ఏర్పాటు చేస్తే భలే ఉంటుంది కదూ!