అటవీ స్టేషన్లు అటకెక్కినట్లే!
అరసవల్లి: అటవీ సంపద రక్షణ, అటవీ గ్రామాల ప్రజల భద్రతకు వీలుగా జిల్లాల్లో అటవీ పోలీస్స్టేషన్లు ఏర్పాటు చేస్తాం.. సిబ్బందికి ఆయుధాలు ఇస్తాం.. నాలుగు నెలల క్రితం ప్రభుత్వం ఆర్భాటంగా చేసిన ప్రకటన ఇది.ఇప్పుడదే ప్రభుత్వం స్వరం మార్చింది. స్టేషన్లు లేవు.. సిబ్బందీ లేరు. అవసరమైతే పోలీసు శాఖ సహాయం తీసుకోండి అనే సలహాతో సరిపెట్టేసింది.చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్ల దాడులు, కాల్పుల నేపథ్యంలో అటవీ ప్రాంతాలు ఉన్న అన్ని జిల్లాల్లో అటవీ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని హడావుడి చేసిన తీరు చూసి విస్తారమైన అటవీ ప్రాంతం ఉన్న శ్రీకాకుళం జిల్లాలోనూ అటవీ స్టేషన్లు ఏర్పాటవుతాయని, తమ పని కొంత సులువు అవుతుందని అటవీ, పోలీస్ శాఖల అధికారులు భావించారు. నెలలు గడుస్తున్నా ప్రభుత్వం ఆ ఊసే ఎత్తడం లేదు. జిల్లాలోని సీతంపేట, కొత్తూరు, భామిని, పాలకొండ, వీరఘట్టం, పాతపట్నం, మందస తదితర మండలాలకు ఆనుకుని అడవులు ఉన్నాయి. ఈ మండలాల్లో పోలీస్ స్టేషన్ల మాదిరిగానే అటవీ స్టేషన్లు ఏర్పాటవుతాయని ఆశించారు. అయితే ఇంతవరకు రాష్ట్రస్థాయి అధికారులు వీటి వివరాలైనా కోరలేదు. ఆ ప్రతిపాదన అటకెక్కినట్లేనని కొందరు అటవీ అధికారులు కూడా భావిస్తున్నారు.
పోలీసు బలగాల సాయం తీసుకోండి
ప్రభుత్వ తీరు ఎలా ఉన్నా.. జిల్లా పరిస్థితిని బట్టి అటవీ స్టేషన్లు ఏర్పాటు చేయడం అవసరమన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇప్పటికే జిల్లా అటవీశాఖలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. అదే సమయంలో సీతంపేట ఏజెన్సీలో ఏళ్ల తరబడి ఏనుగులు భయానక వాతావరణం సృష్టిస్తున్నాయి. కలప అక్రమ రవాణా వంటివి జోరుగానే సాగుతున్నాయి. వీటిన్నింటినీ నియంత్రించడం తక్కువ సిబ్బంది ఉన్న అటవీ శాఖకు కష్టసాధ్యంగా మారింది. ఇప్పుడున్న సిబ్బందికి శిక్షణ ఇచ్చి, ఆయుధాలు అందజేస్తామని కూడా ప్రభుత్వం ప్రకటించింది. తాజా పరిస్థితుల్లో అది కూడా కార్యరూపం దాల్చే అవకాశాల్లేవు.
అంతగా అవసరమైతే పోలీసు బలగాల సాయం తీసుకోవాలని ఉన్నతాధికారులు సూచించడంతో జిల్లా అటవీ అధికారులు ఎస్పీతో సంప్రదించి ఆయా పోలీస్ స్టేషన్ల సిబ్బంది, అటవీ సిబ్బంది సమన్వయంతో పని చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని జిల్లా అటవీశాఖ అధికారి విజయకుమార్ వద్ద ప్రస్తావించగా అటవీ స్టేషన్లు ఏర్పాటయ్యే పరిస్థితి ఇప్పుడు లేదన్నారు. సిబ్బందికి ఆయుధాలు సమకూర్చడంపైనా ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు లేవని, అవసరమైతే పోలీసు సహాయం తీసుకోవాలని ఉన్నతాధికారులు సూచించారని వివరించారు.