వైఎస్సార్సీపీలోకి ఎన్‌హెచ్ భాస్కరరెడ్డి!
నేడో రేపో రంగం సిద్ధం
ఫలించిన భూమా మంతనాలు
నంద్యాల, న్యూస్‌లైన్ : నేడో రేపో తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుగుదేశం పార్టీ నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గ మాజీ ఇన్చార్జి ఎన్‌హెచ్ భాస్కరరెడ్డి తెలిపారు. గురువారం ఆయన నంద్యాలలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం జిల్లా పర్యటనకు వస్తున్నందున ఆయన సమక్షంలో పార్టీలో చేరతానని పేర్కొన్నారు. కాగా.. అంతకుముందు వైఎస్సార్సీపీ నంద్యాల సమన్వయకర్త భూమా నాగిరెడ్డి.. ఎన్‌హెచ్ భాస్కరరెడ్డి, ఆయన సోదరుడు, టీడీపీ జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు ఎన్‌హెచ్ ప్రసాదరెడ్డిని కలిసి మంతనాలు జరిపారు.
ఎన్‌హెచ్ భాస్కరరెడ్డి 2009లో నంద్యాల అసెంబ్లీకి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి 34,979 ఓట్లను సాధించారు. ఈయన వైఎస్సార్సీపీలో చేరితే పార్టీ మరింత బలోపేతం కాగలదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎమ్మెల్యే శిల్పా మోహన్‌రెడ్డి టీడీపీలో చేరడంతో భాస్కరరెడ్డి ఆ పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి 2009లో టీడీపీ తరఫున ఎవరూ పోటీ చేయడానికి ముందుకు రాని సమయంలో ఎన్‌హెచ్ భాస్కర్‌రెడ్డి సాహసం చేశారు.
అంతేగాక మూడేళ్ల క్రితం టీడీపీ తరఫున శాసనమండలికి పోటీ చేయడానికి అభ్యర్థులెవరూ సమయంలో పార్టీకి అండగా నిలిచారు. ఐదేళ్ల నుంచి పార్టీ కార్యకలాపాలకు భారీ ఎత్తున వ్యయం చేశారు. కష్ట సమయాల్లో టీడీపీకి అండగా నిలిచినా.. చివర్లో తనతో ఏ మాత్రం సంప్రదించకుండా తన రాజకీయ ప్రత్యర్థి శిల్పాను పార్టీలో చేర్చుకోవడం బాధాకరమని తన అనుచరులతో ఎన్‌హెచ్ భాస్కరరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.